పరాజయంతో ప్రారంభం | Indian womens team lost to Australia in the first ODI | Sakshi
Sakshi News home page

పరాజయంతో ప్రారంభం

Published Fri, Dec 29 2023 4:58 AM | Last Updated on Fri, Dec 29 2023 4:58 AM

 Indian womens team lost to Australia in the first ODI - Sakshi

ముంబై: ఈసారైనా ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్‌ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. వరల్డ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియా జట్టుతో గురువారం వాంఖెడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు సాధించింది.

జెమీమా రోడ్రిగ్స్‌ (77 బంతుల్లో 82; 7 ఫోర్లు), పూజ వస్త్రకర్‌ (46 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... ఓపెనర్‌ యస్తిక భాటియా (64 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించింది. అస్వస్థత కారణంగా భారత వైస్‌ కెపె్టన్, ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అనంతరం ఆ్రస్టేలియా జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి గెలిచింది.

కెప్టెన్ అలీసా హీలీ (0) ఖాతా తెరవకుండానే అవుటైనా... ఫోబి లిచ్‌ఫీల్డ్‌ (89 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఎలీసా పెరీ (72 బంతుల్లో 75; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక తాలియా మెక్‌గ్రాత్‌ (55 బంతుల్లో 68 నాటౌట్‌; 11 ఫోర్లు), బెత్‌ మూనీ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి ఆసీస్‌ విజయాన్ని ఖరారు చేశారు. భారత బౌలర్లలో రేణుక, పూజ, స్నేహ్‌ రాణా, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌ తీశారు. రెండో వన్డే శనివారం ఇదే వేదికపై జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement