‘పేస్’ గుర్రం
సత్తా చాటుతున్న నెహ్రా
37 ఏళ్ల వయసులో బౌలింగ్ జోరు
{పపంచకప్‌లో కీలకం కానున్న సీమర్
‘నా ఎంపిక విషయంలో ఇన్నేళ్లుగా ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా వాళ్లకు నా మొహం నచ్చలేదేమో, కనీసం నా భార్యకైనా నచ్చినందుకు సంతోషం’... భారత జట్టులో పునరాగమనం కోసం దాదాపు నాలుగేళ్ల పాటు ప్రయత్నించి, శ్రమించి చివరకు ఆవేదనతో సెలక్టర్ల గురించి ఆశిష్ నెహ్రా చేసిన వ్యాఖ్య ఇది.
సోమరి, జిమ్ అంటే దూరం, బలహీన శరీరం, ఎప్పుడూ గాయాలే... ఇలా నెహ్రా గురించి వచ్చిన, వినిపించిన విశేషణాలు అన్నీ ఇన్నీ కావు. వెన్నునొప్పి, వేలు, మడమ, చేతులు, పక్కటెముకలు... ఇలా అతని శరీరంలో గాయపడిన భాగాల జాబితా కూడా పెద్దదే. కాబట్టి ఆ మాటల్లోనూ వాస్తవం లేకపోలేదు. కానీ ఇదంతా గతం.
ఇప్పుడు నెహ్రా మారిపోయాడు. మనం చూస్తోంది అతని కొత్త అవతారం. రెండు పదుల వయసు ఉన్న పేస్ బౌలర్ కూడా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న చోట 37 ఏళ్ల నెహ్రా కుర్రాడిలా చెలరేగిపోతున్నాడు. తన వయసులో ఉన్నవాళ్లు ఆట మానేసి కామెంటరీ చెబుతున్న సమయంలో అతను యార్కర్లు సంధిస్తున్నాడు.
దాదాపు నాలుగేళ్ల పాటు జట్టుకు దూరమై పునరాగమనం చేయడమే అనూహ్యం అనుకుంటే... టి20ల్లో నెహ్రా ప్రదర్శన మరింత పదునెక్కుతూ వస్తోంది. ఏదో జట్టులో ఉన్నాడని కాకుండా ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రధాన పేసర్‌గా కొత్త బంతితో అతను ప్రభావం చూపిస్తున్న తీరు వయసు మళ్లినా పంజా పదును తగ్గని వృద్ధ సింహాన్ని గుర్తుకు తెస్తోంది.
క్రీడా విభాగం ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం ఆశిష్ నెహ్రాను ఎంపిక చేసినప్పుడు అన్ని వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమైంది. క్రికెట్‌కు సంబంధించి ఒక రకంగా ముసలితనంగా భావించే 37 ఏళ్ల వయసులో టి20లాంటి యూత్ క్రికెట్‌కు అతని అవసరం ఉందా? యువ పేసర్లు మన దగ్గర లేరా? అని అందరూ వ్యాఖ్యానించారు. అయితే ఆటలో జోరు, ఫిట్‌నెస్ ఉంటే వయసుతో పని లేదని నెహ్రా నిరూపించాడు. ఆడిన 7 మ్యాచ్‌లలో 18.30 సగటుతో 10 వికెట్లు పడగొట్టిన అతను కీలక సమయాల్లో ఆ వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. భారత్ వరుస విజయాల్లో అతని బౌలింగ్ కూడా కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. తాను వేసే నాలుగు ఓవర్లలోనే స్లో బంతులు, కటర్‌లు, యార్కర్లతో వైవిధ్యం ప్రదర్శిస్తూ నెహ్రా మంచి ఫలితాలు సాధించాడు. ఆరంభంలో వేసే ఓవర్లు గానీ, డెత్ ఓవర్లలో కానీ అతను తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ‘తాను ఫిట్‌గా ఉంటే ఏం చేయగలడో నెహ్రాకు బాగా తెలుసు. అతని బౌలింగ్‌లో చక్కటి క్రమశిక్షణ ఉంది. ఎంత పెద్ద వయసు ఉన్నా, అతని అనుభవం ఈ ఫార్మాట్‌లో కీలకంగా మారింది. మేం ఆశించిన విధంగా అతని ప్రదర్శన ఉండటం శుభ పరిణామం’ అని కెప్టెన్ ధోని ప్రశంసలు కురిపించడం నెహ్రా ప్రభావాన్ని చూపిస్తోంది.
ఐపీఎల్‌తోనే మలుపు
గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరఫున నెహ్రా ప్రదర్శనను దగ్గరినుంచి చూడటం వల్లే ధోని కూడా అతని అవసరాన్ని గుర్తించాడు. వరుసగా ప్రయత్నించిన యువ బౌలర్లంతా తేలిపోవడంతో చివరి ఓవర్లలో తనకు కావాల్సిన బౌలర్ నెహ్రానే అని కెప్టెన్ భావించినట్లున్నాడు. ఐపీఎల్‌లో ఆడిన 16 మ్యాచ్‌లలో కలిపి అతను 7.24 ఎకానమీతో 22 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌లలో కనీసం మూడు వికెట్లు చొప్పున పడగొట్టాడు. అందుబాటులో ఉన్న 64 ఓవర్లలో 62 ఓవర్లు బౌలింగ్ చేసి ఫిట్‌నెస్ కూడా నిరూపించుకున్నాడు. అయితే ఈ ప్రదర్శన తర్వాత కూడా వెంటనే నెహ్రాకు జాతీయ జట్టు పిలుపు రాలేదు. భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు అతడిని పట్టించుకోలేదు. ‘ఐపీఎల్ ముగిసిన పది రోజుల్లో అంతా నన్ను మరచిపోతారు’ అంటూ నెహ్రా ఆ సమయంలో తన బాధను వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు మరీ పూర్తిగా మరచిపోలేదు. సొంతగడ్డపై సఫారీల చేతిలో పరాజయం తర్వాత ఆసీస్ మైదానాల్లో ఒక అనుభవజ్ఞుడి అవసరాన్ని వారు గుర్తించారు. అందుకే టి20 ఫార్మాట్‌కు సరిపోతాడని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. ఈ వెటరన్ పేసర్ వారి నమ్మకాన్ని నిలబెట్టాడు.
కుర్రాళ్లతో పోటీ పడుతూ...
2011 వన్డే ప్రపంచకప్ సెమీస్ ఆడిన తర్వాత నాలుగేళ్లకు పైగా నెహ్రా భారత జట్టుకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యలు ఒక కారణమైతే, వెల్లువలా వచ్చిన కొత్త పేసర్ల ముందు అతడిని ఎవరినీ పట్టించుకోలేదు. నిజానికి ఆ సమయానికి అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆ తర్వాతా దేశవాళీలో రెగ్యులర్‌గా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్‌లో రెగ్యులర్‌గా ఆడకపోయినా... వన్డేలు, టి20లు మాత్రం కొనసాగించాడు. చాలెంజర్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో ప్రతీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను ఉన్నాడు. యువ బౌలర్లతో పోటీ పడుతూ వారితో సమానంగా రాణించిన నెహ్రా కొన్నిసార్లు వారికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అయినా నాలుగేళ్ల పాటు అతనిపై సెలక్షన్ కమిటీ దృష్టి పడలేదు. 2015 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో కూడా అతని పేరు లేదు. అయితే నెహ్రా విషయంలో భూమి గుండ్రంగా ఉందనే మాట నిజమైంది! 2011 ప్రపంచకప్ తర్వాత ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ వరకు భారత వన్డే, టి20 జట్లలో కలిపి 19 మంది పేస్ బౌలర్లు ఆడారు. కానీ ఇన్నేళ్ల తర్వాత అందరినీ కాదని మరో అవకాశం నెహ్రాను వెతుక్కుంటూ వచ్చింది.
మారిపోయాడు
ఐపీఎల్‌తో నెహ్రా ఫిట్‌నెస్, బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందు కోసం అతను కఠోరంగా శ్రమించాడు. కెరీర్ పొడిగించుకోవాలనే పట్టుదలతో మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తన యాక్షన్‌తో శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉన్నా... గాయాలపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బౌలింగ్‌లో ఇన్నేళ్లకు కూడా కించిత్ వేగం తగ్గకపోవడం విశేషం. అన్నింటికీ మించి తీవ్ర సాధనతో నెహ్రా యార్కర్ మరింత పదునెక్కింది. ఐపీఎల్‌లో పదే పదే ఈ బంతిలో ఫలితం రాబట్టగలిగిన అతని సామర్థ్యం భారత్ తరఫున మరో అవకాశం కల్పించింది. ఆటలో కొనసాగుతూనే ఉన్నా... ఎవరూ పట్టించుకోక ఒక రకమైన అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ సీనియర్ పేస్ బౌలర్ ఇప్పుడు మరోసారి భారత్ విజయాల్లో భాగమయ్యాడు. ఇదే జోరు కొనసాగించి శుభారంభాలు ఇస్తే ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో మరోసారి అతనూ ఉండటం ఖాయం.
37 ఏళ్ల వయసులో ఒక పేసర్ పునరాగమనం చేయడం సులభం కాదు. ఫాస్ట్ బౌలింగ్ అంటే 75 శాతం ఫిట్‌నెస్‌దే పాత్ర. 30 ఏళ్లు దాటితే పేస్ బౌలింగ్ భారంగా అనిపిస్తూ ఉంటుంది. నా దృష్టిలో వయసు పెద్ద సమస్య కాదు. ఫలానావారి పని అయిపోయిందని ఇక్కడ చెప్పలేం. కష్టపడితే మళ్లీ అవకాశం దక్కవచ్చు. 36 ఏళ్ల ఆటగాడు, 26 ఏళ్లవాడు ఇద్దరూ బాగా ఆడుతుంటే తక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కానీ 40 ఏళ్లు ఉంటే తీసుకోవద్దని, ఎలా ఆడినా 20 ఏళ్లవాడికే అవకాశం ఇవ్వాలని అనుకోవద్దు. అంతర్జాతీయ క్రికెట్ అంటే అండర్-19 క్రికెట్ కాదుగా. టి20ల్లో బౌలర్లపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. మూడు ఓవర్లు బాగా వేసినా ఒక్క బంతి మ్యాచ్‌ను మార్చేస్తుంది. వాటన్నింటినీ తట్టుకుంటూ రాణించడంలోనే మన విలువేమిటో తెలుస్తుంది.
-ఆశిష్ నెహ్రా