
న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు టీమిండియా విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. మిడిలార్డర్‌లో అజింక్యా రహానే, హనుమ విహారి అద్భుతంగా ఆడారని, ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నాడు. ఇక ఓపెనర్లలో మయాంక్ అగర్వాల్ ఆకట్టుకున్నా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడని, అతడి స్థానంలో డాషింగ్ బ్యాట్సమెన్ రోహిత్‌శర్మకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించాడు.
ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ 9 మ్యాచుల్లోనే ఐదు శతకాలతో 648 పరుగుల అద్బుత ప్రదర్శనను ఎవరు మర్చిపోలేరు అని తెలిపాడు. విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ స్థానం ఆశించాడని, కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా బెంచ్‌కు పరిమితం చేయడం తనకు నచ్చలేదని గంగులీ తెలిపాడు. వరుస అవకాశాలు వచ్చినా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా విఫలమవుతూ వస్తున్నాడని, ఇప్పటివరకు 27 టెస్టుల్లో 50 సగటుతో పరుగులు సాధించిన రోహిత్‌శర్మను ఓపెనర్‌గా ఆడిస్తే బాగుంటుందని చాలాసార్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో అజింక్యా రహానే, హనుమ విహారిలు ఆకట్టుకోవడంతో అక్కడ వేరే వారికి అవకాశం లేకుండా పోయిందని గంగూలీ స్పష్టం చేశాడు.