బ్రిస్బేన్ : తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన టీమిండియా యువకెరటం రిషభ్ పంత్.. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం తనకే ఉందనే నమ్మకాన్ని కల్గించాడు. ఇంగ్లండ్, విండీస్ సిరీస్‌లో రాణించిన పంత్.. ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగానే ఆరంభించాడు. బ్రిస్బేన్ వేదికగా బుధవారం ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో కీలక సమయంలో దినేశ్ కార్తీక్‌తో కలిసి చెలరేగాడు. ఓటమి అంచున చేరిన మ్యాచ్‌ను తిప్పి భారత శిభిరంలో ఆశలు రేకిత్తించాడు. విజయం భారత్‌దే అనుకున్నారు అంతా.. కానీ పంత్ తన చెత్త షాట్‌తో గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఆసీస్ వశం చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం మ్యాచ్ అనంతరం ఇదే అభిప్రాయపడ్డాడు. ‘ మేం బ్యాటింగ్ ఘనంగా ఆరంభించాం. మిడిల్ ఓవర్స్‌లో తడబడ్డాం. కానీ పంత్-కార్తీక్‌ల బ్యాటింగ్‌తో విజయం మాదే అని భావించాం. కానీ పంత్ వికెట్‌తో మ్యాచ్ చేజారిపోయింది’ అని చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం కోహ్లి వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ.. కనీసం మెల్‌బోర్న్ గేమ్‌లోనైనా పంత్ షాట్ సెలక్షన్ మార్చుకోవాలని హితవు పలికాడు. ‘రిషభ్ పంత్.. కార్తీక్‌తో కలిసి మ్యాచ్ గెలిపించాల్సింది. దాదాపు ఈ ఇద్దరు గెలిపించేంత పనిచేశారు. ఆ సమయంలో పంత్ ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. అతనో ఓ యువ ఆటగాడు.. షాట్ సెలక్షన్ గురించి సీనియర్ ఆటగాళ్లు అతనికి చెప్పాల్సిన అవసరం ఉంది. అతనికి ఇలాంటి చెత్త షాట్స్ ఆడాల్సిన అవసరం లేదు. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. షాట్ సెలక్షన్ మార్చుకోవాలి. ఇదేం కష్టమైన పని కాదు’ అని ఓ టీవీ చానెల్‌తో గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఇక పంత్ బాధ్యాతా రాహిత్యంపై అభిమానులు కూడా మండిపడుతున్నారు. వెస్టిండీస్‌తో చివరి టీ20లో ఇలానే ఆడి విఫలమైన పంత్.. ఆసీస్‌తో కీలక సమయంలో ఇలా బాధ్యాతా రహితంగా ఆడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ సమయంలో ఎలా ఆడాలో పంత్‌కు చెప్పాలని కోచ్, కెప్టెన్‌లను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment