విజయాల ‘సఫారీ’ | south africa team never lost the match in test match series | Sakshi
Sakshi News home page

విజయాల ‘సఫారీ’

Published Sun, Dec 15 2013 1:16 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

విజయాల ‘సఫారీ’ - Sakshi

విజయాల ‘సఫారీ’

ఏడేళ్ల క్రితం...శ్రీలంక గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కోల్పోయింది. ఈ ఓటమి ఆ జట్టును పూర్తిగా మార్చేసింది. టెస్టు క్రికెట్‌లో అజేయ శక్తిగా ఎదిగేందుకు పక్కా వ్యూహాలతో సఫారీలు సాగారు. దక్షిణాఫ్రికా చరిత్రలో దిగ్గజాలుగా నిలిచిన కొంత మంది ఆటగాళ్లు ముందు నిలబడి తమ జట్టును నడిపించారు. ఫలితంగా ఆ తర్వాత జరిగిన 24 సిరీస్‌లో ప్రొటీస్ ఒక్కటి మాత్రమే కోల్పోయింది. ప్రతీ అగ్రశ్రేణి జట్టు బెదిరే ఉపఖండంపై కూడా మళ్లీ దక్షిణాఫ్రికా ఆ తర్వాత సిరీస్ ఓడిపోలేదు. ఇతర జట్లతో పోలిస్తే ఆలస్యంగా ఆటలో అడుగు పెట్టినా...నంబర్ వన్ స్థాయికి ఎదిగి నిలకడను కొనసాగిస్తోంది.
 
 సాక్షి క్రీడా విభాగం
 గత ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే చిత్తు చేసి దక్షిణాఫ్రికా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. 2013లో టెస్టు ర్యాంకింగ్స్‌లో కొంత కాలం పాటు ఒకే సమయంలో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ (ఆమ్లా), బౌలర్ (స్టెయిన్), ఆల్‌రౌండర్ (కలిస్)గా ఆ జట్టు సభ్యులే నిలిచారు. టెస్టుల్లో ఆ జట్టు ఆధిపత్యానికి ఇది నిదర్శనం.
 
 
 అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్, పదునైన పేస్ బౌలింగ్‌తో పాటు సమర్థ నాయకత్వం కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. 2009లో సొంత గడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఓడటం మినహా ఆ జట్టు దాదాపు అజేయంగా కనిపించింది. ముఖ్యంగా ఈ ఏడేళ్ల కాలంలో దక్షిణాఫ్రికా తిరుగులేని ప్రదర్శనతో అక్కడా, ఇక్కడా అని లేకుండా ఎక్కడైనా గెలుపు రుచి చూసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఆయా జట్ల సొంతగడ్డలపై ఓడించి తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో భారత్‌లో గత రెండు సిరీస్‌లను డ్రాగా ముగించగలిగింది.
 
 రథ సారథులు...
 దక్షిణాఫ్రికా శిఖరానికి చేరడంలో కొంత మంది ఆటగాళ్ల పాత్ర ప్రధానంగా ఉంది. వారిలో ఒకరిద్దరు మినహా అందరూ ప్రస్తుత జట్టులో కూడా కీలకంగా జట్టు భారాన్ని మోస్తున్నారు. బ్యాటింగ్ టాపార్డర్‌లో స్మిత్, హాషిం ఆమ్లా అనేక చిరస్మరణీయ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఓపెనర్ స్మిత్ ఇన్నేళ్ల కాలంలో తన భాగస్వాములు ఎంతో మంది మారినా నిలకడైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరో వైపు ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆమ్లా దక్షిణాఫ్రికా చరిత్రలో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.

 సమకాలీన క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కాని అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జాక్ కలిస్ జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సోబర్స్ తర్వాత ఆ స్థాయిలో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు దక్కింది కలిస్‌కే. ఇక ఫార్మాట్ ఏదైనా బ్యాటింగ్‌లో దూకుడును జోడించే డివిలియర్స్‌పై టీమ్ ఎంతో ఆధారపడి ఉంది. మరో వైపు స్ట్రైక్ బౌలర్‌గా డేల్ స్టెయిన్ రికార్డు అద్భుతం. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా అతని బుల్లెట్ బంతులకే బ్యాట్స్‌మెన్ మానసికంగా బెదిరిపోతారు.  అహ్మదాబాద్‌లో భారత్‌పై ఒక విదేశీ బౌలర్ ద్వారా మెరుపు బౌలింగ్ ప్రదర్శన (5/23) ఊహకు కూడా అందనిది. 2009నుంచి స్టెయిన్ టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతుండటం విశేషం.
 
 మరికొందరు అండగా...
 దక్షిణాఫ్రికా విజయ ప్రస్థానంలో మరి కొందరు తమదైన ముద్ర వేసి జట్టుకు విజయాలు అందిస్తున్నారు. ఇప్పుడు జట్టులో లేకపోయినా వికెట్ కీపర్‌గా బౌచర్ పాత్ర మరువలేనిది. అనూహ్య పరిస్థితుల్లో మైదానంలో కన్ను పోగొట్టుకుని అతను నిష్ర్కమించిన కొద్ది రోజులకే స్మిత్ సేన నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది.
 
 ఇక 2008లో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన డుమిని ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బ్యాటింగ్‌లో గత ఆరేడేళ్లలో పెద్దగా మార్పులు లేకపోయినా బౌలింగ్ మాత్రం మరింత ప్రమాదకరంగా మారింది.  స్టెయిన్ పేస్‌కు అండగా...బౌన్స్‌తో మోర్కెల్, స్వింగ్‌తో ఫిలాండర్ చెలరేగడంతో అగ్నికి వాయువు తోడైనట్లే అయింది. నంబర్‌వన్‌ను అందుకునే క్రమంలో ఇంగ్లండ్‌పై జట్టును గెలిపించడంలో మోర్కెల్‌దే కీలక పాత్ర. ఇక ఫిలాండర్ అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అనూహ్య రికార్డు తో అరంగేట్రం చేశాడు. తొలి 7 టెస్టుల్లోనే 50 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
 
 బెస్ట్ కెప్టెన్...
 గ్రేమ్ స్మిత్ మొత్తం కెరీర్‌లో 113 టెస్టులు ఆడితే అందులో 103 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 51 మ్యాచ్‌ల్లో జట్టు విజేతగా నిలవడం చూస్తే స్మిత్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది. బ్యాట్స్‌మన్‌గా కూడా చక్కటి రికార్డు ఉన్నా...స్మిత్‌కు తగినంత పేరు రాలేదనేది వాస్తవం. అయితే నాయకుడిగా మాత్రం ఎవరైనా నిర్ద్వంద్వంగా అతని గొప్పతనాన్ని అంగీకరిస్తారు. వ్యక్తిగతంగా గొప్పవాళ్లయినా అనేక మంది ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ టీమ్‌ను విజయాల వైపు నడిపించడం అంత సులువు కాదు.
 
  ఇన్నేళ్లలో ఆటగాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు గానీ, జట్టులో ఇగో సమస్యలు, వివాదాలు కానీ రాలేదంటే అది కచ్చితంగా స్మిత్ చాతుర్యమే. ‘మా బలం జట్టు కెప్టెన్’ అని సహచరులు అనేక సందర్భాల్లో బహిరంగంగానే తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏదైనా సిరీస్‌లో వెనుకబడ్డ సందర్భాల్లో కూడా స్థైర్యం కోల్పోకుండా జట్టును అతను అనేక సార్లు దిశా నిర్దేశం చేశాడు. ఇటీవల యూఏఈలో పాక్‌తో జరిగిన సిరీస్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదేమైనా దక్షిణాఫ్రికా విజయ యాత్ర నంబర్‌వన్ కావడంతోనే ఆగిపోలేదు. ఏడాదికి పైగా నిలకడగా ఆడుతున్న ఆ జట్టు సమష్టి కృషితో తమ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్ప ఘనత.
 
  2006లో శ్రీలంక చేతిలో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో ఓడింది. ఆ తర్వాత 24 సిరీస్‌లు ఆడితే ఒక్కటే సారి 2009లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
 
 సొంతగడ్డపై 12 సిరీస్‌లలో 8 గెలిచి, ఒక్కటి ఓడింది. మూడు డ్రాగా ముగిశాయి. విదేశాల్లో 12 సిరీస్‌లు ఆడితే ఇందులో 8 సిరీస్‌లు గెలిచింది. 4 డ్రా అయ్యాయి.
 
 గత ఏడేళ్లలో దక్షిణాఫ్రికా 65 టెస్టులు ఆడితే 37 టెస్టుల్లో గెలిచి 13 టెస్టుల్లో మాత్రమే ఓడింది. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement