శ్రీలంకతో ఉత్కంఠభరిత ‘డ్రా’
టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా దక్షిణాఫ్రికా
కొలంబో: శ్రీలంక గడ్డపై 21 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు టెస్టు సిరీస్ గెల్చుకుంది. సోమవారం ఇక్కడ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టును దక్షిణాఫ్రికా ‘డ్రా’ చేసుకోగలిగింది. విజయం కోసం చివరి రోజు 331 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కష్ట సాధ్యమైన విజయలక్ష్యం కావడంతో సఫారీ బ్యాట్స్‌మెన్ తొలి బంతినుంచే డ్రా కోసం ఆడారు. ఆమ్లా (159 బంతుల్లో 25), డివిలియర్స్ (67 బంతుల్లో 12), డుమిని (65 బంతుల్లో 3) జట్టును రక్షించే ప్రయత్నం చేశారు.
వీరందరూ వెనుదిరిగినా చివర్లో ఫిలాండర్ (98 బంతుల్లో 27 నాటౌట్) పోరాడి దక్షిణాఫ్రికాను గట్టెక్కించాడు. రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించినా... లంక ఆఖరి రోజు 94 ఓవర్లు బౌలింగ్ చేసి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. స్పిన్నర్ హెరాత్ (5/40) శ్రమ వృథా అయింది. తొలి టెస్టు నెగ్గిన దక్షిణాఫ్రికా 1-0తో సిరీస్ సొంతం చేసుకుంది. తాజా ఫలితంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరో సారి టెస్టుల్లో నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంది.