
జొహన్నెస్‌బర్గ్: అద్భుత ఆటతో పాటు బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. 612 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఫిలాండర్ (6/21) నిప్పులు చెరగడంతో... ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులకే కుప్పకూలింది. దాంతో దక్షిణాఫ్రికా 492 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3–1తో దక్కించుకుంది. పరుగులపరంగా దక్షిణాఫ్రికాకు ఇదే పెద్ద విజయం. 1970లో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఓవర్‌నైట్ స్కోరు 88/3తో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఫిలాండర్ దెబ్బకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తొలి సెషన్‌లోనే కుప్పుకూలింది.
హ్యాండ్స్‌కోంబ్ (24) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జోడించి వెనుదిరగగా.. షాన్ మార్‡్ష (7), మిచెల్ మార్‡్ష (0) కెప్టెన్ పైన్ (7), కమిన్స్ (1), లయన్ (9), సేయర్స్ (0) ఘోరంగా విఫలమయ్యారు. మరోవైపు ఈ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ముందే ప్రకటించిన మోర్నీ మోర్కెల్ (2/28) కూడా తన బౌన్సర్లతో బెంబేలెత్తించాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆసీస్ కోచ్ లీమన్ ఈ మ్యాచ్ అనంతరం తన పదవికి రాజీనామా చేశాడు. ఫిలాండర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రబడకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి.