పియాంగ్ చాంగ్ : వందల కోట్ల ఖర్చుతో నిర్మితమైన భారీ స్టేడియం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు వేడుకల తర్వాత నిర్వీర్యంగా మారనుందా అంటే అవుననే చెప్పాలి. కొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. శీతాకాల ఒలింపిక్స్-2018 కోసం పియాంగ్ చాంగ్ (దక్షిణ కోరియా) ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకలను అట్టహాసంగా జరపాలని ఉద్దేశంతో పియాంగ్ చాంగ్ లో భారీ స్టేడియాన్ని నిర్మించారు. కానీ ఆ తర్వాత తాము చేసిన పనికి అధికారులు తలలు పట్టుకున్నారు. అదేంటి స్డేడియాన్ని నిర్మించడం తప్పేమి కాదుగా.. ఎందుకీ అవస్థ అంటారా. ఆ స్టేడియం నిర్మాణానికి అక్షరాల వంద మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 635కోట్లు) ఖర్చు చేసింది. ఒకేసారి 35000 మంది వీక్షించే సదుపాయం కలదు. ఇంత భారీ ఖర్చుతో నిర్మించిన స్టేడియాన్ని కేవలం నాలుగంటే నాలుగు సార్లు మాత్రమే ఉపయోగిస్తారు.
శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు మాత్రమే వేదిక కానుంది. ఆ తర్వాత స్టేడియాన్ని ఏ అవసరాలకు వినియోగించాలో అర్థంకాక అధికారులు తికమక పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ స్టేడియాల పరిస్థితి ఇలానే ఉన్నాయి. రియో, అట్లాంట ఒలింపిక్స్ స్టేడియాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని స్టేడియాలు ఆటగాళ్ల వసతులకు ఉపయోగపడుతున్నాయి. పియాంగ్ చాంగ్ లో స్డేడియం సామర్థ్యం కంటే కేవలం 10 వేల మంది ఎక్కువ ప్రజలు ఉన్న దేశంలో భవిష్యత్తులో దాని నిర్వహణకు చేసే ఖర్చు తలుచుకుంటే అధికారులకు వారి తప్పిదం అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment