అటు క్రికెట్, ఇటు హాకీ...  | Special to ireland player | Sakshi
Sakshi News home page

అటు క్రికెట్, ఇటు హాకీ... 

Aug 8 2018 1:51 AM | Updated on Aug 8 2018 1:51 AM

Special to ireland player - Sakshi

డబ్లిన్‌: కేవలం 13 ఏళ్ల వయసులో దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ బరిలోకి... ప్రపంచ క్రికెట్‌లోనే మరెవరికీ సాధ్యం కాని ఘనత ఇది. 18 ఏళ్లు కూడా నిండకుండానే జాతీయ హాకీ జట్టు తరఫున హాకీ మ్యాచ్‌... 20 ఏళ్లకే వరల్డ్‌ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యురాలు... ఐర్లాండ్‌కు చెందిన ఎలెనా టైస్‌ అరుదైన ప్రదర్శన ఇది. ఆదివారం జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన ఐర్లాండ్‌ జట్టులో టైస్‌ సభ్యురాలు. ఈ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు అనూ హ్యంగా ఫైనల్‌కు చేరింది.

ఇందులో డిఫెండర్‌గా టైస్‌ కూడా కీలకపాత్ర పోషించింది. అంతకుముం దు నాలుగేళ్ల పాటు ఆమె క్రికెటర్‌గా ఐర్లాండ్‌ తరఫున సత్తా చాటింది. ఆగస్టు 2015లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఎలెనా... మొత్తం 15 వన్డేలు, 25 టి20ల్లో ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. లెగ్‌ స్పిన్నర్‌ అయిన ఆమె రెండు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 24 వికెట్లు పడగొట్టింది. గతంలో ఎలైస్‌ పెర్రీ (ఫుట్‌బాల్‌), సుజీ బేట్స్‌ (బాస్కెట్‌బాల్‌), సోఫీ డివైన్‌ (హాకీ) కూడా క్రికెట్‌తో పాటు మరో ఆటలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. వారి స్ఫూర్తితోనే తాను ముందుకు వెళ్లానని ఎలెనా చెబుతోంది. 2020 ఒలింపిక్స్‌లో ఐర్లాండ్‌ హాకీ జట్టు అర్హత సాధించేలా చేసి అందులో ఆడటమే తన లక్ష్యమని అంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement