
సాక్షి క్రీడావిభాగం: తల్లి కాబోతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భవిష్యత్‌లో మళ్లీ రాకెట్ పడుతుందో లేదో తెలియదుకానీ... అమ్మతనం ఆటకు అడ్డంకి కాదని గతంలో పలువురు టెన్నిస్ స్టార్లు నిరూపించారు. ప్రసవానంతరం బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సందర్భాలున్నాయి. ఆ వివరాలు...
►2008లో రిటైర్మెంట్ ప్రకటించిన కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) కుమార్తెకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత పునరాగమనం చేసింది. 2009, 2010లలో యూఎస్ ఓపెన్; 2011లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ కూడా సాధించింది.
► మహిళల టెన్నిస్‌లో అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ తల్లి హోదా వచ్చాక ఒకే ఏడాది ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం విశేషం. తొలి సంతానం కోసం 1971, 1972లో ఆటకు విరామం చెప్పిన మార్గరెట్ తల్లి అయ్యాక 1973లో పునరాగమనం చేసి ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకుంది.
►ఆస్ట్రేలియాకే చెందిన ఇవాన్ గూలాగాంగ్ 1977 మేలో పాపకు జన్మనిచ్చాక ఆ ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తోపాటు 1980లో వింబుల్డన్ టైటిల్‌నూ సాధించింది.
►గతేడాది అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ వారాల గర్భంతోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు కుమార్తె కలిగాక నెలల వ్యవధిలోనే సెరెనా పోటీల్లో పాల్గొంటోంది. ఇప్పటికి 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన సెరెనా వచ్చేనెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
►రెండుసార్లు (2012, 2013) ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అజరెంకా (బెలారస్) 2016 డిసెంబర్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్ టోర్నీ లో రాకెట్ పట్టి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలోనూ సెమీఫైనల్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment