‘మలయాళ’ మారుతం
నెలలు నిండకుండానే జన్మించిన బిడ్డ కరుణ్ నాయర్...బలహీనమైన ఊపిరితిత్తులతో పుట్టి సరిగా కూర్చోలేక పదే పదే కింద పడిపోయేవాడు. వయసు ఎదుగుతున్నా పసివాడిలాగే ఏడుపు ఉండేది. ఒక దశలో అతను ఎలా బతకగలడో అన్న ఆందోళన కూడా వారితల్లిదండ్రుల్లో ఉండేది. ఎక్కువగా మాట్లాడని ఆ కుర్రాడికి పసితనమంతా‘ప్లే స్టేషన్’తోనే గడిచింది.దాదాపు ఆరు నెలల క్రితం భారత్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత కరుణ్ మొక్కు తీర్చుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి అలెప్పీకి వెళ్లాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న బోటు పంపా నదిలో తిరగబడటంతో అతని సన్నిహితుల్లో ఇద్దరు చనిపోగా, ఈత రాక మునిగిపోతున్న నాయర్‌ను స్థానికులు కాపాడారు.ఈ రెండు ఘటనల మధ్య పాతికేళ్ల వ్యవధి ఉంది. అప్పుడు అతని జీవితం గురించి కన్నవారు బెంగ పడ్డారు. ఇప్పుడు తనకు లభించిన కొత్త జీవితంతో ఏదైనా సాధించాలని అతను గట్టిగా తనకు తాను చెప్పుకున్నాడు. సరిగ్గా ఆరు నెలల తర్వాత కరుణ్ నాయర్ కొత్త చరిత్రను సృష్టించాడు. భారత క్రికెట్‌ను సుసంపన్నం చేసిన మహామహులకే సాధ్యం కాని రీతిలో ట్రిపుల్ సెంచరీతో టెస్టు ప్రపంచంలో తనదైన పేరును సగర్వంగా లిఖించుకున్నాడు.
మెకానికల్ ఇంజినీర్ అయిన తండ్రి కళాధరన్ ఉద్యోగరీత్యా జోధ్‌పూర్‌లో ఉన్నప్పుడు కరుణ్ పుట్టాడు. ఈ మలయాళీ కుటుంబం చివరకు బెంగళూరులో స్థిరపడింది. ప్రాథమిక స్థాయిలో రాణించిన తర్వాత మంగళూరు యునైటెడ్ క్లబ్ అతడికి మంచి అవకాశాలు కల్పించింది. అక్కడ రాటుదేలి 15 ఏళ్ల వయసులోనే కర్ణాటక అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత కరుణ్ వెనుదిరిగి చూడలేదు. రంజీ ట్రోఫీలో కూడా తొలి సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి కర్ణాటక టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన అతను... తర్వాతి సీజన్‌లో జట్టు దానిని నిలబెట్టుకోవడంలో కూడా ప్రధాన భాగమయ్యాడు. ముఖ్యంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్లో చేసిన 328 పరుగుల స్కోరు నాయర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2014 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 75 లక్షలకు తీసుకోగా, జట్టులో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2016 ఐపీఎల్‌లో అతను రూ.10 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉండగా, 40 రెట్లు ఎక్కువగా చెల్లించి ఢిల్లీ సొంతం చేసుకుంది. డేర్ డెవిల్స్ కోచ్‌గా, ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా కూడా రాహుల్ ద్రవిడ్ సూచనలు అతడిని తీర్చిదిద్దాయి. దేశవాళీలో 50కి పైగా సగటుతో మూడేళ్ల పాటు పరుగుల వరద పారించిన కరుణ్, గత సంవత్సరం శ్రీలంకతో సిరీస్‌కు గాయపడిన విజయ్ స్థానంలో ఎంపికైనా మ్యాచ్ అవకాశం రాలేదు. ఈ ఏడాది ధోని నాయకత్వంలో జింబాబ్వే పర్యటించిన జట్టులో సభ్యుడిగా అతను రెండు వన్డేలు ఆడాడు. ఈ సీజన్‌లో కూడా ఇంగ్లండ్ టెస్టుకు ఎంపిక కాక ముందు ఆడిన 4 రంజీ ఇన్నిం గ్స్‌లలో 74, 54, 53, 145 పరుగులు చేశాడు. మొహాలీలో సహచరుడు రాహుల్ గాయంతో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కి దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. ముంబై టెస్టులో రహానే గాయంతో లక్కీగా చేరి 13 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో రాణించకపోతే బహుశా అతను మరో అవకాశం కోసం సుదీర్ఘకాలం వేచి ఉం డాల్సి వచ్చేదేమో. కానీ తన క్లాస్, మాస్ ఆటను మొత్తం కలగలిపి అతను కొట్టిన ‘తీన్‌మార్’ దెబ్బ నేరుగా సెలక్టర్లకే తగిలింది.
‘నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. కలలా అనిపిస్తున్న దీనిని నమ్మేందుకు మరో రెండు రోజులు పడుతుందేమో. సెంచరీ చేయగానే నాపై ఒత్తిడి పోయింది. ట్రిపుల్ గురించి అసలు ఆలోచన లేదు. 250 వద్ద డిక్లరేషన్‌కు సిద్ధమైనా, నా కోసం ఆగిన జట్టుకు కృతజ్ఞతలు. అమ్మా నాన్న ముందు దీనిని సాధించడం అమితానందంగా ఉంది. ట్రిపుల్ సెంచరీ సమయంలో నా మనసులో చాలా భావాలు చెలరేగుతున్నాయి. అందుకే ఆ ఘనతను సాధించిన సమయంలో ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేకపోయాను’.