జాదూ చూపించాడు!
సత్తా చాటిన కేదార్ జాదవ్
అవకాశం అందిపుచ్చుకున్న మహారాష్ట్ర బ్యాట్స్‌మన్
దేశవాళీలో అద్భుత రికార్డు
రెండేళ్ల క్రితం కేదార్ జాదవ్ తన మిత్రులతో కలిసి థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో అతనికి తొలిసారి భారత జట్టులో స్థానం లభించినట్లు ఫోన్ వచ్చింది. కానీజాదవ్‌కు నిజంగా గుర్తింపు దక్కేందుకు మాత్రం ఆ ఎంపిక పనికి రాలేదు. మొదటి సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశమే రాకపోగా, భారత్ తరఫున బరిలోకి దిగేందుకు అతను మరో ఆరు నెలల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది.
దేశవాళీ క్రికెట్‌లో ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉండి, రికార్డు సంఖ్యలో పరుగులు కొల్లగొట్టిన తర్వాత కూడా జాదవ్ టీమిండియా సభ్యుడిగా మారేందుకు చాలా సమయం పట్టింది. స్థిరమైన చోటు లభించని వేళ, దక్కిన కొన్ని అవకాశాలను కూడా రెండు చేతులతో ఒడిసి పట్టుకోవాల్సిన స్థితిలో పుణే వన్డే అతని కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. కోహ్లిని మరిపించిన బ్యాటింగ్ కేదార్‌ను అందరూ గుర్తించేలా చేసింది.
సాక్షి క్రీడా విభాగం ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బౌలింగ్‌కు దిగి కేదార్ జాదవ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. బయటివాళ్ల సంగతేమో కానీ... భారత బౌలింగ్ మాజీ కోచ్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా విస్మయానికి లోనయ్యారు. ‘నేను నెట్స్‌లో కూడా ఎప్పుడూ జాదవ్ బౌలింగ్ చేయడం చూడలేదు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ మాత్రమే సాధన చేయడం నాకు తెలుసు’ అని ఆయన చెప్పారు. అయితే జాదవ్ అండర్–19 రోజుల నుంచి కూడా కోచ్‌గా పని చేసిన సురేంద్ర భావే మాత్రం కేదార్ అపార ప్రతిభావంతుడని ప్రశంసించారు. ఆలస్యంగా అవకాశం దక్కినా అతను తనను తాను నిరూపించుకోగలడని భావే విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో సొంతగడ్డపై కుటుంబ సభ్యుల సమక్షంలో జాదవ్ ఆడిన ఇన్నింగ్స్ కోచ్ మాటలను నిజం చేసింది. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన కేదార్, తన ఎంపిక సరైందేనని నిరూపించాడు.
రంజీల్లో దూకుడు...
ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌తోనే, ఒక మెరుపు ప్రదర్శనతోనే భారత జట్టులోకి ఎంపికైన ఆటగాడు కాదు కేదార్. రంజీ ట్రోఫీలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రతీ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ భారీగా పరుగులు చేసిన అతను మహారాష్ట్ర జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా బాధ్యత నిర్వర్తించాడు. 2013–14 సీజన్‌లో 1,233 పరుగులు చేసి తమ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది ఆరు సెంచరీలు కూడా బాదాడు. అంతకుముందు సీజన్‌లోనే ట్రిపుల్ సెంచరీతో జాదవ్ సత్తా చాటాడు. మొదటినుంచీ దూకుడైన ఆటకు మారుపేరైన జాదవ్ 105 స్ట్రైక్ రేట్‌తో దేశవాళీ వన్డేల్లో పరుగులు సాధించడం విశేషం. 2014 ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు మొత్తం విఫలమైనా, అతను ఒక్కడే తనపై ఉంచిన రూ. 2 కోట్ల నమ్మకాన్ని నిలబెడుతూ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో నాలుగు జట్ల టోర్నీని గెలుచుకోవడంలో కూడా జాదవ్‌దే కీలక పాత్ర.
అవకాశం దక్కగానే...
ఏడాదిన్నర క్రితం రహానే నేతృత్వంలో జింబాబ్వే పర్యటించిన జట్టులోకి ఎంపికైన కేదార్, అక్కడే తొలి సెంచరీని నమోదు చేశాడు. అయితే దాదాపు సంవత్సరం తర్వాత మరో జింబాబ్వే సిరీస్ వరకు అతనికి చాన్స్ రాలేదు. దురదృష్టవశాత్తూ అక్కడ మూడు వన్డేల్లో భారత్ తొందరగా లక్ష్యాన్ని ఛేదించడంతో ఒక్కసారి కూడా బ్యాటింగ్ రాలేదు. మొదటిసారి న్యూజిలాండ్‌తో పూర్తి స్థాయి సిరీస్ (ఐదు వన్డేలు) ఆడిన జాదవ్ ‘జాదూ’ ఏమిటో క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఈ సిరీస్‌లో తన బౌలింగ్ మెరుపులకు తోడు ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో 37 బంతుల్లో 41 పరుగులు చేసి బ్యాటింగ్ పదును కూడా చూపించాడు. కానీ ఇప్పుడు పుణే మ్యాచ్‌తో కేదార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 2016 ఐపీఎల్‌లో కోహ్లితో ఏర్పడిన సాన్నిహిత్యం అతని ఆటను మరింత తీర్చిదిద్దింది. ఇప్పుడు కోహ్లి అండతోనే అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వచ్చే మార్చిలో 32 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న కేదార్, మున్ముందు మరిన్ని గొప్ప మ్యాచ్‌లలో భాగం కావాలని పట్టుదలగా ఉన్నాడు.
‘జాదవ్ ఇన్నింగ్స్ గురించి అద్భుతం అనే మాట తప్ప మరొకటి చెప్పను. అతను కొట్టిన కొన్ని షాట్లను నేను నిజంగా నమ్మలేకపోయాను. ఏదో గుడ్డిగా బ్యాట్ ఊపినట్లు కాకుండా అతను చాలా బాగా ఆడాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గెలవగలమనే పట్టుదల ఉన్న ఇలాంటి బ్యాట్స్‌మన్ లభించడం ఆనందంగా ఉంది’ – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్