అంతా భారతే చేసిందన్న పాక్‌.. ఖండించిన లంక | Sri Lanka Minister Says Reason Of Their Players Backing Out Of Pak Tour | Sakshi
Sakshi News home page

అంతా భారతే చేసిందన్న పాక్‌.. ఖండించిన లంక

Oct 2 2019 1:38 PM | Updated on Oct 2 2019 2:10 PM

Sri Lanka Minister Says Reason Of Their Players Backing Out Of Pak Tour - Sakshi

హైదరాబాద్‌: వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై పాకిస్తాన్‌ విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంటది. అనవసర విషయాల్లో భారత్‌ను బయటకు లాగి పాక్‌ అనేకసార్లు నవ్వులపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్‌- శ్రీలంక సిరీస్‌ అంతగా విజయవంతం కాకపోవడంతో పాక్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.  దీంతో ఏం చేయాలో అర్థంకాక భారత్‌పై బురదజల్లే ఆలోచనలో పాక్‌ ఉంది. దీనిలో భాగంగా  శ్రీలంకకు చెందిన పది మంది క్రికెటర్లు పాకిస్తాన్‌కు వెళ్లకుండా భారత్‌ అడ్డుకుందని పాక్‌ మంత్రి ఫావద్‌ చౌదరీ అసత్య ఆరోపణలు చేశాడు. 

‘ పది మంది శ్రీలంక క్రికెటర్లు పాక్‌కు రాకుండా భారత క్రీడా శాఖ ఒత్తిడి చేసింది. భారత్‌ చవకబారు వ్యూహాల కారణంగానే లంక ఆటగాళ్లు పాక్‌ పర్యటనకు రాలేదు’అంటూ పాక్‌ మంత్రి ఫావద్‌ చౌదరీ ట్వీట్‌ చేశాడు. ఫావద్‌ ఆరోపణలను శ్రీలంక ఖండించింది. ఈ వివాదంపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి ఫెర్నాండో ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘లంక క్రికెటర్లు పాక్‌ వెళ్లకుండా భారత్‌ ఎలాంటి ఒత్తిడి చేయలేదు.  2009లో లంక క్రికెటర్లపై జరిగిన దాడి కారణంగానే ప్రస్తుత సిరీస్‌కు పది మంది ఆటగాళ్లు పాక్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు. అంతేకానీ మా ఆటగాళ్లపై బీసీసీఐ ప్రభావం ఉందనడం అవాస్తవం. ఇక పాక్‌ పర్యటనకు పూర్తిస్థాయి జట్టునే పంపించాం. ప్రస్తుత సిరీస్‌లో లంక ఆటగాల్లు శక్తిమేర ఆడి సిరీస్‌ గెలుస్తారనే పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు ఉంది’అంటూ ఫెర్నాండో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement