
ట్వంటీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక బోణీ
చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బోణీ కొట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న లంకేయులు ఐదు పరుగుల తేడాతో సఫారీలను కంగుతినిపించారు. లంకేయులు విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలోసఫారీలు చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు కాక్ (25), ఆమ్లా (23) పరుగులతో ఫర్వాలేదనిపించారు. అనంతరం డుమినీ(39),డివిలియర్స్(24) పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టేందుకు యత్నించారు. కాగా చివరి వరుస ఆటగాళ్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బౌలర్లలో సేననాయకే రెండు వికెట్లు తీయగా, మాథ్యూస్, మలింగా, కులశేఖరాలకు తలో వికెట్టు లభించింది.
టాస్ గెలిచిన లంకేయులు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ దిల్షాన్(0)పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరి ఆదిలోనే లంకను నిరాశపరిచాడు. మరో ఓపెనర్ పెరీరా మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. పెరీరా ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేసి లంక ఇన్నింగ్స్ కు జీవం పోశాడు. అనంతరం జయవర్ధనే(9), సంగక్కారా(14) పరుగులు మాత్రమే చేసి లంకను మరోసారి కష్టాల్లోకి నెట్టారు.ఈ క్రమంలో క్రీజ్ లోకి మాథ్యూస్ (43) పరుగులు చేయడంతో లంకేయులు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు.