సెమీఫైనల్లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివానిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వియత్నాంలోని హో చి మింగ్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... శ్రావ్య పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక 6–3, 6–4తో ఆరో సీడ్ జింగ్‌యి వాంగ్ (చైనా)పై గెలుపొందగా, ఐదో సీడ్ శివాని 4–6, 6–0, 3–6తో నాలుగో సీడ్ చున్‌జి గుయో (చైనా) చేతిలో ఓడింది.
నేడు జరిగే సెమీఫైనలో శ్రీవల్లి... ఏడో సీడ్ పీ యు లై (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–1తో రాఫెల్లా విల్లనుయెరా (ఫిలిప్పీన్స్)పై అలవోక విజయం సాధించగా, శ్రావ్య శివాని 7–5, 6–2తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి–జింగ్ యంగ్ (చైనా) జోడి 5–7, 7–5, 6–10తో గాబ్రియెల్లా–రేనియా అజీజ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడింది. శివాని–రాఫెల్లా విల్లనుయెరా జోడి 6–3, 6–1తో హుయాన్ హుయంగ్–కె సుయాన్ జంగ్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది.