
వారె‘వ్వావ్రింకా’...
మెల్‌బోర్న్: ఈ ఏడాది చెన్నైలో మొదలుపెట్టిన విజయాల పరంపరను మెల్‌బోర్న్‌లోనూ కొనసాగించిన స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేశాడు. ఆద్యంతం నమ్మశక్యంకానిరీతిలో ఆడిన వావ్రింకా ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు.
ఆదివారం 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ వావ్రింకా 6-3, 6-2, 3-6, 6-3తో రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో వావ్రింకా ఎనిమిదో స్థానం నుంచి కెరీర్‌లో అత్యుత్తమంగా మూడో స్థానానికి ఎగబాకుతాడు.
రన్నరప్ సానియా జోడి
కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా-హొరియా టెకావ్ (రుమేనియా) జంట రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సానియా-టెకావ్ ద్వయం 3-6, 2-6తో క్రిస్టినా మ్లడెనోవిక్ (ఫ్రాన్స్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడి చేతిలో ఓడిపోయింది. రన్నరప్ సానియా జంటకు 67,750 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 36 లక్షల 99 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
ఈసారి అద్భుతం
ఈ సీజన్‌లో ఆడిన తొలి టోర్నీ చెన్నై ఓపెన్‌లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన 28 ఏళ్ల వావ్రింకా అదే జోరును కొనసాగించాడు. క్వార్టర్ ఫైనల్లో ‘హ్యాట్రిక్ చాంపియన్’ రెండో సీడ్ జొకోవిచ్‌ను ఐదు సెట్‌లలో... సెమీఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్‌ను ఓడించిన వావ్రింకా ఫైనల్లోనూ హడలెత్తించాడు. నాదల్‌తో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతోపాటు కనీసం ఒక్క సెట్ కూడా నెగ్గని వావ్రింకా గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో మాత్రం అద్భుతమే సృష్టించాడు.
ఏస్‌ల జోరు
మ్యాచ్‌లో వావ్రింకా 19 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 12 సార్లు వచ్చి 11 సార్లు పాయింట్లు నెగ్గాడు. 15 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదిసార్లు సఫలమయ్యాడు. 53 విన్నర్స్ (స్పష్టమైన పాయింట్లు) కొట్టిన వావ్రింకా 49 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు నాదల్ కేవలం ఒక ఏస్ కొట్టాడు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేసి కేవలం రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించాడు.
విశేషాలు
విజేతగా నిలిచిన వావ్రింకాకు 26 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 44 లక్షల 41 వేలు); రన్నరప్ నాదల్‌కు 13 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 22 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
2002లో థామస్ జొహాన్సన్ (స్వీడన్-ప్రపంచ 18వ ర్యాంకర్) తర్వాత టాప్-4లో లేని క్రీడాకారుడు తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు.
కెరీర్‌లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ నెగ్గిన 36వ క్రీడాకారుడు వావ్రింకా.
1993 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్గీ బ్రుగుయెరా (స్పెయిన్) ఘనత తర్వాత... టాప్ సీడ్, రెండో సీడ్ ఆటగాళ్లను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడిగా వావ్రింకా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా వావ్రింకా తన కెరీర్‌లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో టాప్-10 ర్యాంకింగ్ ఆటగాళ్లను ఓడించాడు.
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాక తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్ వావ్రింకా. అతనికిది 36వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఈ జాబితాలో గొరాన్ ఇవానిసెవిచ్ (48 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు-2001 వింబుల్డన్ చాంపియన్) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ విజయంతో వావ్రింకా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా స్విట్జర్లాండ్ నంబర్‌వన్ ప్లేయర్ కానున్నాడు. 2001 నుంచి 13 ఏళ్లపాటు ఫెడరర్ ఈ స్థానంలో ఉన్నాడు.
ఓపెన్ శకంలో తొలిసారి టాప్ సీడ్, ఎనిమిదో సీడ్ క్రీడాకారుల మధ్య పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరిగింది.
మూడో సెట్ మినహా
పదునైన సర్వీస్‌లు... కళ్లు చెదిరే సింగిల్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌లు... సుదీర్ఘ ర్యాలీలను విన్నర్స్‌తో ముగించడం... శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్స్... ఇలా ఫైనల్లో వావ్రింకా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తొలి సెట్‌లోని నాలుగో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ అదే జోరులో 37 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోనూ వావ్రింకా జోరు తగ్గలేదు.
మరోవైపు తన ప్రత్యర్థి దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలో నాదల్‌కు అర్థం కాలేదు. వెన్నునొప్పి కూడా రావడంతో కోర్టులోనే చికిత్స చేయించుకున్నాడు. కొన్నిసార్లయితే వావ్రింకా అనవసర తప్పిదాలతోనే నాదల్‌కు పాయింట్లు వచ్చాయి. నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన వావ్రింకా 38 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్‌లో నాదల్ తేరుకున్నాడు. వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను 33 నిమిషాల్లో సెట్ నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. అయితే నాలుగో సెట్‌లో వావ్రింకా మళ్లీ ఏకాగ్రతతో ఆడుతూ నాదల్‌ను కోలుకోనియలేదు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
‘‘అంతా కలలా అనిపిస్తోంది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుస్తానని ఏనాడూ ఊహించలేదు.
గతేడాది జొకోవిచ్ చేతిలో
ఐదు సెట్‌ల మ్యాచ్‌లో
ఓడిపోయాక బాధతో ఏడ్చేశాను. ఏడాది కాలంలో చాలా
మార్పు వచ్చింది.’’-వావ్రింకా