
విరాట్..'బిజీ'మ్యాన్!
న్యూఢిల్లీ: దేశంలో అధిక మొత్తాన్ని తీసుకునే బ్రాండ్ అంబాసిడర్లలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఒకడు. సుమారు 15 పెద్ద బ్రాండ్లకు విరాట్ అంబాసిడర్గా ఉన్నాడు. అటు ఆడిదాస్ నుంచి ఆడి కారు వరకూ, ఇటు టిస్సోట్ వాచెస్ నుంచి పెప్సీ శీతలపానీయం వరకూ కోహ్లినే బ్రాండ్ అంబాసిడర్. దీంతో 2015లో బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సంపాదించే ఆటగాళ్లలో విరాట్ స్థానం సంపాదించాడు. దాంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల సరసన కోహ్లి నిలిచాడు.
ఈ ప్రకటనలతోనే కాదు.. క్రికెట్ ఫీల్డ్లో కూడా విరాట్ది ప్రత్యేకం స్థానం. క్రికెట్ మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే విరాట్ తన ఖాతాలో చాలా ఘనతలనే వేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్‌లో నాలుగు శతకాలు, ఒకే సీజన్లో అత్యధిక పరుగులు. ఇలా క్రికెట్లో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న కోహ్లి.. వ్యాపారవేత్తగా కూడా బిజీగా ఉన్నాడు.
ఇండియన్ సూపర్ లీగ్లో గోవా ఫ్రాంచైజీ సహ యజమానిగా ఉండటంతో పాటు, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ లో యూఏఈ జట్టుతో విరాట్ భాగస్వామ్యమయ్యాడు. మరొకవైపు ప్రొ రెజ్లింగ్ టీమ్ బెంగళూరు యోధాస్ జట్టును కూడా విరాట్ కొనుగోలు చేశాడు. దీంతోపాటు గతేడాది లండన్కు చెందిన సోషల్ మీడియా స్టార్టప్ స్పోర్ట్ కాన్వోతో పాటు, సింగపూర్కు చెందిన మరొక స్పోర్ట్స్ స్టార్టప్ కంపెనీతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు.
2015లో జిమ్నాజియం (జిమ్ చైన్) ను విరాట్ ఏర్పాటు చేశాడు. గతేడాది రూ.190 కోట్ల పెట్టుబడితో 75 ‘చిసెల్’ జిమ్లను ఏర్పాటు చేసిన కోహ్లి... ఆ జిమ్ సెంటర్లను మరింత పెంచడంపై దృష్టి సారించాడు. 2018 నాటికి ఆ జిమ్ సెంటర్లను 100కు పైగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇలా క్రికెటర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా, బిజినెస్ మ్యాన్ గా దూసుకుపోతున్న కోహ్లి తదుపరి ప్రణాళిక ఏమిటో మరి?