
సెమీస్‌లో ఆంధ్రాబ్యాంక్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ఇంటర్ డిపార్ట్‌మెంటల్ ‘ఎ’ డివిజన్ లీగ్ కబడ్డీ టోర్నమెంట్‌లో ఆంధ్రాబ్యాంక్, దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జట్లు సెమీఫైనల్లోకి చేరాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పోస్టల్, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) జట్లు కూడా సెమీస్‌కు అర్హత సాధించాయి. హైదరాబాద్ స్టేట్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన చివరి లీగ్ పోటీల్లో ఆంధ్రాబ్యాంక్ జట్టు 26-13 స్కోరుతో రాష్ట్ర పోస్టల్ జట్టుపై విజయం సాధించింది. ఆంధ్రాబ్యాంక్ జట్టు ప్రథమార్థభాగం ముగిసే సమయానికి 13-5తో ఆధిక్యాన్ని సాధించింది. ఆంధ్రాబ్యాంక్ జట్టులో సూర్య నాయక్, శివరామకృష్ణ, వెంకటేశ్‌లు చక్కటి రైడింగ్ చేస్తూ తమ జట్టుకు ఎక్కువ పాయింట్లను అందించారు. మరో లీగ్ మ్యాచ్‌లో ఎస్‌సీఆర్ జట్టు 28-20 స్కోరుతో సాయ్ జట్టుపై గెలిచింది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఆర్టీసీ జట్టు 20-18తో ఎస్‌బీఐ జట్టుపై నెగ్గింది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆంధ్రాబ్యాంక్ జట్టుతో సాయ్ జట్టు, ఎస్‌సీఆర్ జట్టుతో రాష్ట్ర పోస్టల్ జట్టు తలపడుతుంది.