
సింగిల్ హ్యాండ్ స్టోక్స్...
⇒మెరుపు సెంచరీ చేసిన పుణే బ్యాట్స్‌మన్
⇒లయన్స్‌పై సూపర్ జెయింట్ అద్భుత విజయం
ఐపీఎల్‌లో రికార్డుస్థాయిలో రూ. 14.5 కోట్ల మొత్తాన్ని దక్కించుకున్న బెన్ స్టోక్స్ తన షాట్ల పదునెంటో చూపించాడు. తొలి ఓవర్ నుంచే మొదలైన పుణే ఇన్నింగ్స్ పతనానికి ఒంటిచేత్తో అడ్డుకట్ట వేస్తూ లక్ష్యానికి చేర్చాడు. వీరోచిత సెంచరీతో కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు.
పుణే: గుజరాత్ లయన్స్ జట్టును అదృష్టం వెక్కిరిస్తోంది. దురదృష్టం వెంటాడుతోంది. గత మ్యాచ్‌లో ‘సూపర్’ ఓవర్‌దాకా పోరాడినా చివరి బంతుల్లో ‘ఫ్లాప్’ అయింది. రైజింగ్ పుణేపై తొలి ఓవర్ నుంచే దెబ్బ మీద దెబ్బ తీసినా ‘ఒకే ఒక్కడు’ స్టోక్స్‌ను అదుపు చేయలేక గెలుపును అందుకోలేకపోయింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి ఆలౌట్ కాగా... తర్వాత పుణే 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి గెలిచింది. ‘సూపర్’ స్టోక్స్ (63 బంతుల్లో 103 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
స్టోక్స్ అద్భుతం...
లక్ష్యం 162... కానీ తొలి 6 బంతుల్లోనే 2 వికెట్లు! మరుసటి ఓవర్లో మరో వికెట్... రహానే (4), స్మిత్ (4), తివారి (0) అవుట్... వెరసి 10 పరుగులకే 3 వికెట్లు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన బ్యాటింగ్ ధాటిని చూపెట్టాడు. ధోనితో కలిసి ముందు వికెట్‌ను కాపాడాడు. తర్వాత ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్టోక్స్... ధోని (26)తో ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. అనంతరం కొండంత లక్ష్యాన్ని భారీ సిక్సర్లతో సులువు చేశాడు. చివరి ఓవర్‌కు ముందు కండరాలు పట్టేయడంతో కాసేపు విలవిల్లాడిన స్టోక్స్ ఆఖరి ఓవర్లో ఆ యాతనతోనే తన టి20 కెరీర్‌లో తొలి సెంచరీ (61 బంతుల్లో)ని పూర్తి చేశాడు.రైజింగ్‌కు విక్టరీని అందించాడు.
ఓపెనర్ల శుభారంభం...: అంతకుముందు ఓపెనర్లు ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెకల్లమ్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి గుజరాత్‌కు శుభారంభం అందించారు. ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ దెబ్బతీశాడు. జోరుమీదున్న కిషన్‌తో పాటు ఫించ్ (13), డ్వేన్ స్మిత్ (0)లను అవుట్ చేయడంతో లయన్స్ ఇన్నింగ్స్ తడబడింది. రైనా (8) రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన వారంతా ఒకట్రెండు బౌండరీలతో అలరించారు తప్ప ఎవరూ ఆదుకోలేకపోయారు. దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు), జడేజా (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) కాసేపు ధాటిగా ఆడటంతో గుజరాత్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. తాహిర్, ఉనాద్కట్ చెరో 3 వికెట్లు తీశారు.