పాకిస్తాన్ క్రికెట్ ఇక ముగిసినట్లే!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను ఆ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ హెచ్చరించాడు. స్వదేశంలో నిర్వహించనున్న సిరీస్లను ఇకపై యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించడం ఆపేయాలని సూచించాడు. అలా కానీ పక్షంలో పాకిస్తాన్ క్రికెట్ శకం ఇక ముగిసినట్లే అని తీవ్ర వ్యాఖ్యలుచేశాడు. గత ఆరేళ్లుగా నిర్జీవంగా ఉండే దుబాయ్, షార్జా, అబుదాబీ పిచ్ లపై ఆడటం వల్ల పాక్ బ్యాట్స్ మన్ చాలా కోల్పోతున్నారని వ్యాఖ్యానించాడు. అందుకే ఆటగాళ్లు టెక్నిక్, తమ నైపుణ్యం లోపించిందన్నాడు.
తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన పాక్, రెండో టెస్టుకొచ్చేసరికి మళ్లీ పాతకథే పునరావృతం అయిందన్న నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ యూసఫ్ ఈ విధంగా స్పందించాడు. 2014-15లో ఆసీస్ తో సిరీస్లో పాక్ బ్యాట్స్ మన్ 9 సెంచరీలు కొట్టగా, ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్ లో రెండు టెస్టుల్లో కలిపి ఒక్క సెంచరీ నమోదైందని వెటరన్ ప్లేయర్ యుసఫ్ పేర్కొన్నాడు. పాక్ లో నిర్వహించాల్సిన సిరీస్ లకు శ్రీలంక, బంగ్లాదేశ్ పిచ్ లను ప్రత్యాయ్నాయంగా భావించాలన్నాడు. ఆలా చేయకపోతే టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఎదుర్కొంటున్న పరిస్థితులు తలెత్తుతాయని పీసీబీకి తన అభిప్రాయాలను వివరించాడు.