
నాగ్ పూర్:గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కు ఆ దేశ సెలక్టర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ లో స్థానం దక్కాలంటే భారత్ తో జరిగే చివరి వన్డేను లక్ష్యంగా నిర్దేశించారు. టీమిండియాతో జరిగే ఆఖరి వన్డేలో సత్తాచాటుకోవాల్సిన అవసరం ఉందంటూ వేడ్ కు నోటీసులు అందజేశారు. ఒకవేళ ఇక్కడ విఫలమైతే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి అతన్ని తప్పించాలని నిర్ణయించారు. గత చాంపియన్స్ ట్రోఫీ నుంచి చూస్తే మాథ్యూ వేడ్ ఏ మ్యాచ్ లోనూ తొమ్మిది పరుగుల్ని మించి చేయలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సెలక్టరు.. మాథ్యూ వేడ్ 'చివరి'అవకాశం ఇచ్చారు. భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా కోల్ కతా వన్డేలో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో మాథ్యూ వేడ్ బాధ్యతారాహిత్యంగా ఆడి అవుటయ్యాడు. దాంతో అతనిపై ఇండోర్ వన్డేలో వేటు వేశారు.
'ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నేను చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఈ కారణంతోనే మూడో వన్డే నుంచి తప్పించారు. అక్కడ నన్ను ఎందుకు పక్కన పెట్టారు అనేది ఇప్పుడు విషయం కాదు. ఇక నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. యాషెస్ సిరీస్ కు ఎంపిక కావాలంటే నేను బాగా ఆడాల్సి ఉంది. నా అవకాశాలు క్లిష్టం కావొచ్చు. నాకు రాబోయే మ్యాచ్ ల గురించి ఆందోళన లేదు. నేను ఏ సమయంలోనైనా పరుగులు చేయాలి. అదే నా ముందున్న లక్ష్యం.నేను శ్రమించాల్సిన అవసరం ఉంది'అని మాథ్యూవేడ్ తెలిపాడు.