సబ్స్టిట్యూట్ గా వరల్డ్ రికార్డు..
వెల్లింగ్టన్:అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డే నెలకొల్పాడు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఇమ్రూల్ కేయిస్. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ రెగ్యులర్ వికెట్ కీపర్ ముష్కిఫికర్ రహీమ్ గాయపడటంతో సబ్స్టిట్యూట్గా ఇమ్రూల్ ఫీల్డ్ లోకి వచ్చాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గోరోజు ఆటలో ఐదు క్యాచ్లతో ఇమ్రూల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో సబ్స్టిట్యూట్గా వచ్చిన వికెట్ కీపర్ ఐదు అంతకంటే ఎక్కువ క్యాచ్లను పట్టిన దాఖలాలు లేవు. దాంతో ఆ ఘనత సాధించిన తొలి సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్ గా ఇమ్రూల్ గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉంచితే, బంగ్లాదేశ్ తరపున అత్యధిక వికెట్ కీపింగ్ అవుట్లు సాధించిన రెండో వికెట్ కీపర్గా ఇమ్రూల్ నిలిచాడు. అంతకుముందు ముష్కిఫికర్ ఆ ఘనతను రెండు సార్లు సాధించాడు.