ఇంతకీ సాక్షి మాలిక్ కోచ్ ఎవరు?
కోల్కతా: రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా రెజ్లర్ సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మాలిక్ కు హరియాణా ప్రభుత్వం రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు అతనికి ఆ చెక్ ఫోటో కాపీని కూడా అందించింది. కాగా, ఆ చెక్ కు సంబంధించి ఇంతవరకూ అసలు చెక్ మాత్రం అందలేదు. ఇదంతా పక్కను పెడితే సాక్షి మాలిక్ 'రియల్'కోచ్ ఎవరు అనే దానిపై ఇప్పడు చర్చ నడుస్తోంది. తన కోచ్లు ఇశ్వర్ దాహియా, మన్ దీప్ సింగ్ లు అంటూ సాక్షి తెలియజేయడమే తాజా వివాదానికి కారణమైంది.
మరోవైపు రజ్ బీర్ సింగ్ కూడా తానే సాక్షి కోచ్నంటూ పేర్కొనడంతో అసలు చెక్ ను ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీనిపై తన కోచ్ ఎవరో, ఆ ప్రైజ్ మనీ ఎవ్వరికీ ఇవ్వాలో సాక్షినే స్పష్టం చేయాలని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆ రాష్ట్ర క్రీడామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు.
రియోలో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించిన అనంతరం హరియాణా ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. దానిలో భాగంగా ఆమె కోచ్ మన్ దీప్ కు రూ. 10లక్షలను ఇస్తామని వెల్లడించింది. అయితే సాక్షి కోరిక మేరకు రియోలో సాక్షితో ఆమెతోపాటు ఉన్న కోచ్ కుల్దీప్ కూడా రూ. 10 లక్షల ఇవ్వనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతర్ తెలిపారు. అయితే ఇప్పడు మరో ఇద్దరు కోచ్లు కూడా ఆమె విజయంలో ముఖ్య భూమిక పోషించామని, ఆ పది లక్షల రూపాయిలు తమకే ఇవ్వాలనడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.