సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఎలెవన్ ఆటగాళ్లు అక్షత్ రెడ్డి (167 బంతుల్లో 141; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిరుమలశెట్టి సుమన్ (134 బంతుల్లో 103; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. ఉప్పల్ స్టేడియంలో కేరళతో ఈ మ్యాచ్ జరుగుతోంది. అక్షత్, సుమన్‌ల దూకుడుతో మ్యాచ్ రెండో రోజు మంగళవారం హైదరాబాద్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88.4 ఓవర్లలో 359 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా హైదరాబాద్‌కు 47 పరుగుల ఆధిక్యం లభించింది. కేరళ బౌలర్లలో అక్షయ్ చంద్రన్ 125 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా...అభిషేక్ మోహన్‌కు 3 వికెట్లు దక్కాయి.
ఆధిక్యం కోల్పోయిన
ప్రెసిడెంట్స్ ఎలెవన్...
మరో వైపు హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం కోల్పోయింది. ఈసీఐఎల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 343 పరుగులకు ఆలౌటైంది. కేవీ అవినాశ్ (142 బంతుల్లో 96; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ అవకాశం కోల్పోయాడు. మయాంక్ అగర్వాల్ (114 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ గోపాల్ (42), అబ్రార్ కాజీ (36) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్ 57 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ భండారికి 3, కనిష్క్‌కు 2 వికెట్లు దక్కాయి.
తమిళనాడు ఘన విజయం...
ఏఓసీ సెంటర్‌లో రెండో రోజే ముగిసిన మ్యాచ్‌లో తమిళనాడు 8 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తు చేసింది. మొహమ్మద్ (3/23), రోహిత్ (2/14), కౌశిక్ (2/17), సురేశ్ కుమార్ (2/21) రాణించడంతో సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 40 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. సుమీత్ సింగ్ (65 బంతుల్లో 71; 11 ఫోర్లు, 1 సిక్స్), నకుల్ వర్మ (82 బంతుల్లో 51; 5 ఫోర్లు), అన్షుల్ గుప్తా (42) రాణించారు. రాహిల్ షాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం తమిళనాడు 19 పరుగుల విజయలక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఢిల్లీకి భారీ ఆధిక్యం...
ఎన్‌ఎఫ్‌సీ మైదానంలో గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో 129 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్లకు 373 పరుగులు చేసింది. మోహిత్ శర్మ (223 బంతుల్లో 126; 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. ఆనంద్ (94 బంతుల్లో 63; 13 ఫోర్లు), సుమీత్ నర్వాల్ (53; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, మిలింద్ కుమార్ (47), మనన్ శర్మ (35 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. గోవా బౌలర్లలో అమిత్ యాదవ్ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
తిరుమలశెట్టి సుమన్ , అక్షత్ సెంచరీలు
Published Wed, Sep 4 2013 12:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement