
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత క్రీడారంగం ప్రముఖులు తమవంతుగా విరాళాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మొత్తం రూ. 59 లక్షలు వితరణ చేశారు. 70 ఏళ్ల గావస్కర్ అందించిన విరాళం మొత్తానికి ఓ విశేషం ఉంది. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్ మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో34 సెంచరీలు టెస్టు ఫార్మాట్‌లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్‌లో చేశారు. దాంతో ఆయన సెంచరీ సంఖ్యకు గుర్తుగా రూ. 35 లక్షలను ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ఆడిన ఆయన 24 సెంచరీలు సాధించారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు తరఫున చేసిన 24 సెంచరీల సంఖ్యకు గుర్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి గావస్కర్ రూ. 24 లక్షలు అందించారు. ఈ ఆసక్తికర విషయాన్ని సునీల్ గావస్కర్ తనయుడు రోహన్ గావస్కర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా గుజరాత్ సీఎం ఫండ్‌కు విరాళం ఇచ్చినట్టు ప్రకటించాడు. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు.
కశ్యప్ విరాళం రూ. 3 లక్షలు
మరోవైపు భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు, హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ కరోనాపై పోరాటానికి మద్దతుగా తెలంగాణ సీఎం సహాయనిధికి తనవంతుగా రూ. 3 లక్షలు విరాళం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment