Indian sports sector
-
సరికొత్త శిఖరాలకు...
కాలక్రమంలో మరో ఏడాది గడిచిపోనుంది... ఒకప్పుడు ప్రాతినిధ్యానికి పరిమితమైన భారత క్రీడాకారులు... ఏడాదికెడాది తమ ప్రతిభకు పదును పెడుతున్నారు... అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. కొన్నేళ్లక్రితం వరకు అందని ద్రాక్షలా కనిపించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సగర్వంగా తమ మెడలో వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఏడాదీ భారత క్రీడాకారులు విశ్వ క్రీడారంగంలో తమదైన ముద్ర వేసి సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. ఊహించని విజయాలతో భారత క్రీడా భవిష్యత్ బంగారంలా ఉంటుందని విశ్వాసం కల్పించారు. కేవలం విజయాలే కాకుండా ఈ సంవత్సరం కూడా వీడ్కోలు, వివాదాలు భారత క్రీడారంగంలో కనిపించాయి. రెండు దశాబ్దాలుగా భారత మహిళల టెన్నిస్‌కు ముఖచిత్రంగా ఉన్న సానియా మీర్జా ఆటకు వీడ్కోలు పలకడం... దేశానికి తమ పతకాలతో పేరు ప్రతిష్టలు తెచ్చిన మహిళా మల్లయోధులు తాము లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్నామని వీధుల్లోకి రావడం... ఈ వివాదం ఇంకా కొనసాగుతుండటం విచారకరం. –సాక్షి క్రీడా విభాగం తొలిసారి పతకాల ‘సెంచరీ’ గత ఏడాదే జరగాల్సిన ఆసియా క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడల్లో భారత బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఏకంగా 107 పతకాలతో ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పతకాల సెంచరీ మైలురాయిని దాటింది. భారత క్రీడాకారులు 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు గెల్చుకున్నారు. ముఖ్యంగా ఆర్చరీ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. పీటీ ఉష తర్వాత ఒకే ఆసియా క్రీడల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ బంగారు పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా జ్యోతి సురేఖ గుర్తింపు పొందింది. బ్యాడ్మింటన్‌లో ఈ ఏడాది పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి అదరగొట్టింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో తొలిసారి డబుల్స్‌లో స్వర్ణ పతకాలు అందించిన ఈ ద్వయం స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు ఆశించిన ఫలితాలు లభించలేదు. ఆమె కేవలం ఒక టోర్నీలో (స్పెయిన్ మాస్టర్స్) మాత్రమే ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. నిఖత్ పసిడి పంచ్... గత ఏడాది తాను సాధించిన ప్రపంచ టైటిల్ గాలివాటం ఏమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఈ సంవత్సరం నిరూపించింది. న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ మళ్లీ తన పంచ్ పవర్ చాటుకుంది. 50 కేజీల విభాగంలో నిఖత్ స్వర్ణం సాధించి వరుసగా రెండో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భారత్ నాలుగు స్వర్ణాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌గా అవతరించడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ నిఖత్ రాణించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మన బల్లెం బంగారం... భారత అథ్లెటిక్స్‌కు ఈ ఏడాది సూపర్‌గా గడిచింది. రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి అందర్నీ అబ్బురపరిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది మరింత ఎత్తుకు ఎదిగిన నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణ పతకంతో మెరిశాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో నీరజ్ జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి విశ్వవిజేతగా అవతరించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా అథ్లెట్ జ్యోతి యెర్రాజీ కూడా ఈ సంవత్సరం మెరిపించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. సానియా అల్విదా... రెండు దశాబ్దాలుగా భారత టెన్నిస్‌కు ముఖచిత్రంగా నిలిచిన సానియా మీర్జా ఈ ఏడాది తన కెరీర్‌కు ముగింపు పలికింది. ప్రొఫెషనల్ ప్లేయర్ హోదాలో ఫిబ్రవరిలో దుబాయ్ ఓపెన్‌లో ఆమె చివరిసారిగా బరిలోకి దిగింది. మార్చి 5వ తేదీన సానియా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేశారు. గతంలో డబుల్స్‌లో తన భాగస్వాములుగా ఉన్న ఇవాన్ డోడిగ్, కారా బ్లాక్, బెథానీ మాటెక్, రోహన్ బోపన్నలతో కలిసి సానియా ఈ వీడ్కోలు మ్యాచ్ ఆడింది. మాయని మచ్చలా... ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారత మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఆసియా చాంపియన్ వినేశ్ ఫొగాట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, బజరంగ్ పూనియా, సంగీత ఫొగాట్ తదితరులు ఆందోళన చేపట్టారు. అనంతరం క్రీడా శాఖ కమిటీ ఏర్పాటు చేసి రెజ్లర్ల ఆరోపణలపై విచారణ చేపట్టారు. బ్రిజ్‌భూషణ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా ఆయనపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. తాజాగా రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి మలిక్ తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ తమ ‘ఖేల్‌రత్న, పద్మశ్రీ, అర్జున’ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. -
2023 రౌండప్: భారత క్రీడారంగంలో కీలక ఘట్టాలు
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ ఈ ఏడాది అత్యుత్తమ విజయాలు నమోదు చేసి తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్‌బాల్, క్రికెట్, చెస్, పారా అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత ఆటగాళ్లు ఈ ఏడాది చిరస్మరణీయ విజయాలు సాధించి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది భారత ఆటగాళ్లు వ్యక్తిగతంగా, టీమ్ విభాగాల్లో సాధించిన అత్యుత్తమ విజయాలు.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి 100 పతకాల మార్కును దాటి (107 పతకాలు (28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్)), పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. 18 సంవత్సరాల వయసులో ఫిడే చెస్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు. చరిత్ర సృస్టించిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత జోడీగా రికార్డు. తొమ్మిదోసారి SAFF చాంపియన్‌గా నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టు. కువైట్‌పై చారిత్రక విజయం సాధించడంతో ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-2కు అర్హత. భారత పురుషుల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా అవతరణ. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల అండర్ 19 జట్టు. వన్డే ప్రపంచకప్‌లో తుది సమరం వరకు అద్భుతంగా పోరాడిన టీమిండియా .. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్లు.. ఆసియా పారా గేమ్స్ చరిత్రలో తొలిసారి వందకు పైగా పతకాలు (111, 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్) సొంతం. ఈ పోటీల్లో భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అర్చరీ వ్యక్తిగత విభాగంలో తొలి వరల్డ్ టైటిల్‌ను సాధించిన అదితి స్వామి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం.. పర్నీత్ కౌర్, అదితి స్వామితో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను గెలుచుకుంది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. -
దివ్యమైన పతకాల పంట
భారతీయ క్రీడా రంగానికి ఇది కనివిని ఎరుగని సీజన్. ఇటీవలే ఏషియన్ గేమ్స్‌లో పతకాల శతకం సాధించిన భారత్ తాజాగా ఏషియన్ పారా గేమ్స్‌లోనూ శతాధిక పతకాలను చేజిక్కించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆసియా పారా క్రీడోత్సవాల్లోనూ శతాధిక పతకాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబరాలు జరుపుకొనే మరో సందర్భం అందించింది. విధి క్రూరంగా వ్యవహరించినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగితే విజయానికి ఆకాశమే హద్దు అనడానికి తాజా ఆసియా పారా క్రీడోత్సవాల్లో పాల్గొన్న మన 303 మంది ఆటగాళ్ళ విజయగాథలే ఉదాహరణ. ఈ పారా గేమ్స్‌లో భారత్ అరడజను ప్రపంచ రికార్డులు, 13 ఏషియన్ రికార్డులు నెలకొల్పింది. క్రీడల్లోనూ భారత్ బలంగా ఎదుగుతున్న క్రమానికి ఇది మరో మచ్చుతునక. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్య దేశంగా నిలవాలని ఆశిస్తున్న భారత్‌కు ఈ విజయాలు అతి పెద్ద ఉత్ప్రేరకాలు. ఈసారి ఆసియా క్రీడోత్సవాల్లో భారత బృందం నినాదం ‘ఇస్ బార్ సౌ పార్’. అలా వంద పతకాల లక్ష్యాన్ని దాటడమే ఈసారి లక్ష్యమనే నినాదంతో ముందుకు దూకిన భారత్ 107 పతకాలతో ఆ గోల్ సాధించింది. చైనాలోని హాంగ్జౌలో సాగిన ఏషియాడ్‌తో పాటు, ఆ వెంటనే అదే వేదికగా సాగిన ఏషియన్ పారా గేమ్స్‌లోనూ భారత్ 111 పతకాలతో మరోసారి ఈ శతాధిక విన్యాసం చేయడం విశేషం. ఏషియన్ గేమ్స్‌లో మనవాళ్ళు కనివిని ఎరుగని రీతిలో పతకాల సాధన చేయడంతో, అందరి దృష్టీ ఈ పారా అథ్లెట్ల మీదకు మళ్ళింది. మొత్తం 191 మంది పురుష అథ్లెట్లు, 112 మంది స్త్రీ అథ్లెట్లు 17 క్రీడా విభాగాల్లో మన దేశం పక్షాన ఈ క్రీడా సంరంభంలో పాల్గొన్నారు. మునుపెన్నడూ పారా క్రీడోత్సవాల్లో లేని విధంగా 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు దేశానికి తెచ్చిపెట్టారు. పతకాల పట్టికలో చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా తర్వాత అయిదో స్థానంలో మన దేశాన్ని నిలిపారు. నిజానికి, భారత క్రీడా వ్యవస్థలో పారా క్రీడల పట్ల దీర్ఘకాలికంగా ఉదాసీనత నెలకొంది. ఉదాహరణకు, 2008 నాటి బీజింగ్ పారాలింపిక్స్‌లో మనం అయిదుగురు అథ్లెట్లనే పంపాం. రిక్తహస్తాలతో ఇంటిదారి పట్టాం. అయితే, ఎనిమిదేళ్ళ క్రితం రియోలోని క్రీడాసంరంభంలో 19 మంది భారతీయ పారా ఒలింపియన్లు పాల్గొని, 2 స్వర్ణాలు సహా మొత్తం 4 పతకాలు ఇంటికి తెచ్చారు. అక్కడ నుంచి పరిస్థితులు క్రమంగా మారాయి. రెండేళ్ళ క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్ళు 5 స్వర్ణాలు సహా 19 మెడల్స్ గెలిచారు. అలా పారా అథ్లెట్లకూ, క్రీడలకూ ప్రాచుర్యం విస్తరించింది. ఏషియన్ పారా గేమ్స్‌లోనూ 2018లో భారత్ 72 పతకాలు గెల్చి, తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అదే ఈసారి హాంగ్జౌలో మనవాళ్ళు ఏకంగా 111 పతకాలు సాధించి, అయిదో స్థానానికి ఎగబాకారు. రానున్న ప్యారిస్ పారాలింపిక్స్ పట్ల ఆశలు పెంచారు. చైనా గెల్చిన 521 పతకాలతో పోలిస్తే, మన సాధన చిన్నదే కావచ్చు. అయితే, దేశంలో అథ్లెట్లతో పాటు పారా అథ్లెట్లూ పెరుగుతూ, క్రీడాంగణాన్ని వెలిగిస్తున్న వైనం మాత్రం అవిస్మరణీయం. ఈ పారా – అథ్లెట్ల భారత బృందం సాధించిన 111 పతకాలకూ వెనుక 111 స్ఫూర్తి కథనాలున్నాయి. చేతులు లేకపోతేనేం, విలువిద్యలో దిట్ట అయిన కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ళ శీతల్ దేవి తన పాదాలతోనే బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించి, పతకం సాధించిన తీరు వైరల్ అయింది. నిరాశలో కూరుకున్న కోట్లమందికి ఆమె సరికొత్త స్ఫూర్తి ప్రదాత. అలాగే, ఒకప్పుడు రెజ్లర్‌గా ఎదుగుతూ, రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోగొట్టుకున్న సుమిత్ అంతిల్ మరో ఉదాహరణ. జీవితంలో పూర్తిగా నిస్పృహలో జారిపోయిన ఆ ఆటగాడు కన్నతల్లి ప్రోత్సాహంతో, అప్పటి దాకా విననైనా వినని పారా క్రీడల్లోకి దిగారు. ఇవాళ జావెలిన్ త్రోయర్‌గా పారాలింపిక్స్‌కు వెళ్ళారు. ఏషియన్ ఛాంపియన్‌గా ఎదిగారు. తాజా క్రీడోత్సవాల్లో తన ప్రపంచ రికార్డును తానే మెరుగుపరుచుకున్నారు. సోదరుడి వివాహంలో కరెంట్ షాక్‌తో చేతులు రెండూ కోల్పోయిన పారా స్విమ్మర్ సుయశ్ నారాయణ్ జాధవ్, కుడి మోచేయి లేని పరుగుల వీరుడు దిలీప్, నడుము కింది భాగం చచ్చుబడినా తొణకని కనోయింగ్ వీరుడు ప్రాచీ యాదవ్... ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు. పారా క్రీడల విషయంలో గతంలో పరిస్థితి వేరు. దేశంలో పారా క్రీడలకు పెద్ద తలకాయ అయిన భారత పారా ఒలింపిక్ కమిటీ అనేక వివాదాల్లో చిక్కుకుంది. 2015లో అంతర్జాతీయ పారా లింపిక్ కమిటీ సస్పెండ్ చేసింది. ఆ పైన 2019లో జాతీయ క్రీడా నియమావళిని ఉల్లంఘించారంటూ, సంఘం గుర్తింపును క్రీడా శాఖ రద్దు చేసింది. ఏడాది తర్వాత పునరుద్ధరించింది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి ఆరోపణలు సరేసరి. అన్ని అవరోధాల మధ్య కూడా ఆటగాళ్ళు పట్టుదలగా ముందుకు వచ్చారు. ఒకప్పుడు నిధులు, శిక్షణ కొరవడిన దశ నుంచి పరిస్థితి మారింది. ప్రత్యేక అవసరాలున్న ఆటగాళ్ళకు నిధులు, శిక్షణనివ్వడంలో శ్రద్ధ ఫలిస్తోంది. భారత క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన పలు కేంద్రాల్లో భారత పారా అథ్లెట్లకు మునుపటి కన్నా కొంత మెరుగైన శిక్షణ లభిస్తోంది. విదేశీ పర్యటనలతో వారికి క్రీడా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఆటగాళ్ళ దీక్షకు తల్లితండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహం తోడై పతకాల పంట పండిస్తోంది. పారా స్పోర్ట్స్ అంటే ఎవరికీ పెద్దగా తెలియని రోజుల నుంచి దివ్యాంగులు పలువురు క్రీడల్ని ఓ కెరీర్‌గా ఎంచుకొనే రోజులకు వచ్చాం. అయితే, ఇది చాలదు. వసతుల్లో, అవకాశాల్లో సాధారణ ఆట గాళ్ళతో పాటు దివ్యాంగులకూ సమప్రాధాన్యమివ్వాలి. దేశంలోని దివ్యాంగ క్రీడాకారుల్లోని ప్రతిభా పాటవాలు బయటకు తేవాలి. 9 నెలల్లో రానున్న ప్యారిస్ పారాలింపిక్స్‌కి అది చేయగలిగితే మేలు! -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్‌లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్‌లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్‌లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
క్రీడలపై క్రీనీడ!
క్రీడా మైదానాల్లో సమవుజ్జీలైన రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపాలి. తమ ప్రతిభా పాటవాలతో స్టేడియంలను హోరెత్తించాలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఆటలు నిర్వహించాల్సిన సంఘాల్లోని పెద్దలే ముఠాలు కట్టి పరస్పరం తలపడుతూ, క్రీడలను గాలికొదిలితే దేశం నగుబాటు పాలవుతుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య(ఫిఫా) నిషేధాస్త్రం సంధించిన నేపథ్యంలో మన క్రీడా సంఘాల పనితీరు మరోసారి చర్చకొచ్చింది. 2012లో భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కూడా ఈ మాదిరే వివాదాల్లో చిక్కుకోవడంతో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) దాన్ని సస్పెండ్ చేయాల్సివచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(బీసీసీఐ) వ్యవహారాలు సైతం గతంలో ఇలాగే బజారుకెక్కడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్షాళనకు పూను కుంది. అయినా మన క్రీడాసంఘాల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. పర్యవసానంగా భారత ఫుట్ బాల్ సమాఖ్య దోషిగా నిలబడింది. క్రీడలతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నాయకులు ఈ సంఘాల్లోకి జొరబడి వాటిని నియంత్రించడం, ఆ రంగంలో సుదీర్ఘానుభవం ఉన్నవారిని తృణీక రించడం మన దేశంలో రివాజుగా మారింది. ఇందువల్ల సంఘాల్లో నిధులు దుర్వినియోగం కావడం, నిబంధనలు గాలికొదిలి ఇష్టానుసారం వ్యవహరించడం పెరిగింది. దాంతో అసలైన ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవుతోంది. మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధిం పులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు సరేసరి. ఎన్ని సమస్యలున్నా ఈమధ్య జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మనవాళ్లు మంచి ప్రతిభ కనబరిచి పతకాల సాధనలో నాలుగో స్థానంలో నిలిచారు. 22 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 23 కాంస్య పతకాలు–మొత్తంగా 61 పతకాలు తీసు కొచ్చారు. 2010లో ఇంతకన్నా ఎక్కువ పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన సంగతి నిజమే అయినా ఆ తర్వాత నిరాశ తప్పలేదు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటోంది. ఈ ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం వేటుపడింది. అంతర్జాతీయంగా 211 దేశాలకు సభ్యత్వం ఉన్న ఫిఫా కొంతకాలంగా మన సమాఖ్య పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోయాడు. మా నిబంధనావళిని బేఖాతరు చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నా వినేవారే లేకుండా పోయారు. సమాఖ్యకు కొత్త కార్యవర్గం ఎన్నికై, దాని అధీనంలో రోజువారీ కార్యకలాపాలుండాలని ఫిఫా సూచిస్తోంది. సాధారణంగా క్రీడాసంఘాలకు అధికారంలో ఉండే పెద్దలవల్ల సమస్యలెదురవు తాయి. కానీ ఫుట్‌బాల్ సమాఖ్యకు విపక్ష ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ గుదిబండగా మారారు. వరసగా మూడుమార్లు ఎన్నికైన ఆయన పదవీకాలం 2020లోనే ముగిసినా న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ పదవి పట్టుకుని వేలాడారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఫుట్‌బాల్ సమాఖ్యకు ఆయన్నుంచి విముక్తి కలిగినా కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. పటేల్‌ను తప్పించినప్పుడే ఫిఫా నిబంధనావళికి అనుగుణంగా చర్యలు తీసుకోమని ఆదేశాలిస్తే వేరుగా ఉండేది. కానీ సమాఖ్య కార్యకలాపాల నిర్వహణకంటూ ఒక పరిపాలక సంఘాన్ని(సీఓఏ) ఏర్పాటుచేయడం, ఆ సంఘం వెనువెంటనే మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులతో ఓటర్ల జాబితా తయారుచేసి, ఎన్నికైన 36 సంఘాల ప్రతినిధులను బేఖాతరు చేయడం, ఎన్నికలకు సిద్ధం కావడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. సీఓఏను ఫిఫా గుర్తించడానికి నిరాకరించి, మన ఫుట్‌బాల్ సమాఖ్యను నిషేధించడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగక తప్పలేదు. నిజానికి బీసీసీఐ కేసు తనముందుకు వచ్చినప్పుడే క్రీడాసంఘాలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా ఏమీ మారనందువల్లే 85 ఏళ్ల మన ఫుట్‌బాల్ సమాఖ్య తొలిసారి వీధిన పడాల్సి వచ్చింది. ఫిఫాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చేసిన సూచనవల్ల ఈ భంగపాటు నుంచి సమాఖ్య బయటపడొచ్చు. కానీ ఎన్నాళ్లిలా? క్రీడా సంఘాలు అంకితభావంతో, స్వయంప్రతిపత్తితో పనిచేయలేవా? కొరడా ఝళిపించినప్పుడు మాత్రమే దారికొస్తాయా? క్రీడాసంఘాల తీరువల్ల ఆటగాళ్లలో నిరాశానిస్పృహలు అలుముకోవడం, దేశానికి తలవం పులు తప్పకపోవడం మాత్రమే కాదు... ఫిఫా తాజా నిర్ణయం పర్యవసానంగా ఏటా రావాల్సిన రూ. 4 కోట్ల నిధులు ఆగిపోతాయి. ఫుట్‌బాల్ క్రీడకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతుంది. పైగా వచ్చే అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్–17 ప్రపంచ కప్ సందిగ్ధంలో పడింది. నిషేధం ఎత్తేసేవరకూ అన్ని దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలూ మన దేశాన్ని దూరం పెడతాయి. ఈ నెలాఖరులో ఇరాన్లో జరగాల్సిన మ్యాచ్‌లలో... వచ్చే నెలలో వియత్నాం, సింగపూర్లలో జరిగే మ్యాచ్‌లలో మన క్రీడాకారులు పాల్గొనలేరు. అందుకే మన క్రీడాసంఘాలు కళ్లు తెరవాలి. క్రీడలపట్ల నిబద్ధత, నిమగ్నతా ఉన్నవారు మాత్రమే సారథ్యం వహించే స్థితి రావాలి. దిగ్గజ క్రీడాకారులూ, క్రీడాభిమానులూ సమష్టిగా నిలబడితే ఇదేమంత అసాధ్యం కాదు. క్రీడా సంఘాలు సర్వస్వతంత్ర సంఘాలుగా రూపొంది దేశంలో క్రీడాభివృద్ధికి కృషిచేస్తేనే మెరికల్లాంటి క్రీడాకారులు రూపొందుతారు. అందుకు భిన్నంగా నిర్ణయరాహిత్యమో, తప్పుడు నిర్ణయాలో రివాజుగా మారితే దేశం తీవ్రంగా నష్టపోతుంది. -
విదేశీ కోచ్‌లు కాదు... వ్యవస్థ బాగుండాలి
న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విదేశీ కోచ్‌ల రాకతో మొత్తం మారిపోతుందనుకుంటే పొరపాటని... ముందు వ్యవస్థ బాగుంటేనే అన్ని బాగుంటాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘మన క్రీడా ప్రగతికి విదేశీ కోచ్‌లు కీలక భూమిక పోషిస్తారు. నిజానికి వారి సేవలు అవసరం కూడా.... భిన్నదేశాలకు చెందిన కోచ్‌ల మేళవింపు మనకు మేలు చేస్తుంది. క్రీడల్లో మనకు నైపుణ్యం లేని చోట ప్రారంభ దశలో విదేశీ సహాయ బృందాలు కావాల్సిందే. అయితే విజయవంతంగా రాణిస్తున్న జట్లకూ విదేశీ కోచ్‌లే ఉండాలంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. దీని వల్ల మన వ్యవస్థకు న్యాయం జరగదు. విదేశీ కోచ్‌లను సలహాదారులుగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమైన కోచింగ్ బాధ్య తలు, అధికారాలు స్వదేశీ కోచ్‌లకే అప్పజెప్పాలి. ఆటగాళ్లు విదేశీ కోచ్‌ల నుంచి నేర్చుకోవడం ముఖ్యమే. అలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్లను వదులుకోవాలి. ఎందుకంటే వాళ్లు మనల్ని ద్వితీయ శ్రేణి జట్టుగానే తయారు చేస్తున్నారు. కారణం వాళ్లూ ద్వితీయ శ్రేణి కోచ్‌లే! వాళ్ల దేశంలోని అత్యుత్తమ కోచ్‌లు వారి ఆటగాళ్లకు సేవలందిస్తారు. రెండో ఉత్తమ కోచ్‌లు ఇతర దేశాలకు తరలి వెళతారు’ అని ఆయన వివరించారు. -
గావస్కర్ విరాళం రూ. 59 లక్షలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత క్రీడారంగం ప్రముఖులు తమవంతుగా విరాళాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మొత్తం రూ. 59 లక్షలు వితరణ చేశారు. 70 ఏళ్ల గావస్కర్ అందించిన విరాళం మొత్తానికి ఓ విశేషం ఉంది. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్ మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో34 సెంచరీలు టెస్టు ఫార్మాట్లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్లో చేశారు. దాంతో ఆయన సెంచరీ సంఖ్యకు గుర్తుగా రూ. 35 లక్షలను ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇక దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడిన ఆయన 24 సెంచరీలు సాధించారు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు తరఫున చేసిన 24 సెంచరీల సంఖ్యకు గుర్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి గావస్కర్ రూ. 24 లక్షలు అందించారు. ఈ ఆసక్తికర విషయాన్ని సునీల్ గావస్కర్ తనయుడు రోహన్ గావస్కర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా గుజరాత్ సీఎం ఫండ్‌కు విరాళం ఇచ్చినట్టు ప్రకటించాడు. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. కశ్యప్ విరాళం రూ. 3 లక్షలు మరోవైపు భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు, హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ కరోనాపై పోరాటానికి మద్దతుగా తెలంగాణ సీఎం సహాయనిధికి తనవంతుగా రూ. 3 లక్షలు విరాళం ఇచ్చాడు. -
ఒలింపిక్స్ వరకు కోచ్‌ల కొనసాగింపు!
న్యూఢిల్లీ: ప్రత్యేకించి ఒలింపిక్స్ కోసమే విదేశీ కోచ్‌లను నియమించుకున్న భారత క్రీడా సమాఖ్యలు ఇప్పుడు ఆ కోచ్‌ల కాంట్రాక్టు గడువు పొడిగించాలని భావిస్తున్నాయి. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ వల్ల టోక్యో మెగా ఈవెంట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఆ పోటీలు ముగిసే వరకు కోచ్‌లను కొనసాగించాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి పలు క్రీడా సమాఖ్యల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మహిళా రెజ్లింగ్ కోచ్ ఆండ్రూ కుక్, షూటింగ్ (పిస్టల్) కోచ్ పావెల్ స్మిర్నోవ్, బాక్సింగ్ కోచ్‌లు శాంటియాగో నియెవా, రాఫెల్లె బెర్గమస్కొ, అథ్లెటిక్స్ హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్ హెర్మన్ తదితర విదేశీ కోచ్‌లకు ‘సాయ్’ పొడిగింపు ఇచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా క్రీడా శిబిరాలేవీ కొనసాగడం లేదు. ఈ లాక్డౌన్ ముగిశాక కోచ్‌ల సేవలు, శిబిరాలు మొదలవుతాయి. ‘విదేశీ కోచ్‌ల జీతాలను ‘సాయ్’ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులు వారికి తెలుసు. కాబట్టి సహకరించేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యదర్శి వీఎన్ ప్రసూద్ తెలిపారు. కుక్ (అమెరికా), టెమొ గెబిష్విలి (జార్జియా), బజ్రంగ్ పూనియా కోచ్ షాకో బెంటినిడిస్ (జార్జియా)లతో డబ్ల్యూఎఫ్ఐ కాంట్రాక్టు పొడిగించుకుంటుంది. 21 రోజుల లాక్డౌన్ పూర్తయ్యాక ఆటగాళ్ల సన్నాహకాలు మొదలవుతాయని ప్రసూద్ ఆశిస్తున్నారు. -
ఖేల్ రత్న రేసులో పళ్లికల్
న్యూఢిల్లీ : భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కోసం స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ పేరును తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. టాప్-10 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా 23 ఏళ్ల దీపికా రికార్డులకెక్కింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో జోష్నా చిన్నప్పతో కలిసి దేశ స్క్వాష్ చరిత్రలో తొలిసారి దీపికా స్వర్ణం సాధించింది. తమిళనాడు క్రీడా అభివృద్ధి అథారిటీ దీపిక పేరును కేంద్రానికి ప్రతిపాదించినప్పుడు తన ర్యాంకు 11 ఉండగా ప్రస్తుతం 18వ స్థానంలో కొనసాగుతోంది.