భారతీయ క్రీడా రంగానికి ఇది కనివిని ఎరుగని సీజన్. ఇటీవలే ఏషియన్ గేమ్స్‌లో పతకాల శతకం సాధించిన భారత్ తాజాగా ఏషియన్ పారా గేమ్స్‌లోనూ శతాధిక పతకాలను చేజిక్కించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆసియా పారా క్రీడోత్సవాల్లోనూ శతాధిక పతకాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబరాలు జరుపుకొనే మరో సందర్భం అందించింది. విధి క్రూరంగా వ్యవహరించినా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగితే విజయానికి ఆకాశమే హద్దు అనడానికి తాజా ఆసియా పారా క్రీడోత్సవాల్లో పాల్గొన్న మన 303 మంది ఆటగాళ్ళ విజయగాథలే ఉదాహరణ.
ఈ పారా గేమ్స్‌లో భారత్ అరడజను ప్రపంచ రికార్డులు, 13 ఏషియన్ రికార్డులు నెలకొల్పింది. క్రీడల్లోనూ భారత్ బలంగా ఎదుగుతున్న క్రమానికి ఇది మరో మచ్చుతునక. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్య దేశంగా నిలవాలని ఆశిస్తున్న భారత్‌కు ఈ విజయాలు అతి పెద్ద ఉత్ప్రేరకాలు.
ఈసారి ఆసియా క్రీడోత్సవాల్లో భారత బృందం నినాదం ‘ఇస్ బార్ సౌ పార్’. అలా వంద పతకాల లక్ష్యాన్ని దాటడమే ఈసారి లక్ష్యమనే నినాదంతో ముందుకు దూకిన భారత్ 107 పతకాలతో ఆ గోల్ సాధించింది. చైనాలోని హాంగ్‌జౌలో సాగిన ఏషియాడ్‌తో పాటు, ఆ వెంటనే అదే వేదికగా సాగిన ఏషియన్ పారా గేమ్స్‌లోనూ భారత్ 111 పతకాలతో మరోసారి ఈ శతాధిక విన్యాసం చేయడం విశేషం.
ఏషియన్ గేమ్స్‌లో మనవాళ్ళు కనివిని ఎరుగని రీతిలో పతకాల సాధన చేయడంతో, అందరి దృష్టీ ఈ పారా అథ్లెట్ల మీదకు మళ్ళింది. మొత్తం 191 మంది పురుష అథ్లెట్లు, 112 మంది స్త్రీ అథ్లెట్లు 17 క్రీడా విభాగాల్లో మన దేశం పక్షాన ఈ క్రీడా సంరంభంలో పాల్గొన్నారు. మునుపెన్నడూ పారా క్రీడోత్సవాల్లో లేని విధంగా 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు దేశానికి తెచ్చిపెట్టారు. పతకాల పట్టికలో చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా తర్వాత అయిదో స్థానంలో మన దేశాన్ని నిలిపారు.
నిజానికి, భారత క్రీడా వ్యవస్థలో పారా క్రీడల పట్ల దీర్ఘకాలికంగా ఉదాసీనత నెలకొంది. ఉదాహరణకు, 2008 నాటి బీజింగ్ పారాలింపిక్స్‌లో మనం అయిదుగురు అథ్లెట్లనే పంపాం. రిక్తహస్తాలతో ఇంటిదారి పట్టాం. అయితే, ఎనిమిదేళ్ళ క్రితం రియోలోని క్రీడాసంరంభంలో 19 మంది భారతీయ పారా ఒలింపియన్లు పాల్గొని, 2 స్వర్ణాలు సహా మొత్తం 4 పతకాలు ఇంటికి తెచ్చారు. అక్కడ నుంచి పరిస్థితులు క్రమంగా మారాయి.
రెండేళ్ళ క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్ళు 5 స్వర్ణాలు సహా 19 మెడల్స్ గెలిచారు. అలా పారా అథ్లెట్లకూ, క్రీడలకూ ప్రాచుర్యం విస్తరించింది. ఏషియన్ పారా గేమ్స్‌లోనూ 2018లో భారత్ 72 పతకాలు గెల్చి, తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అదే ఈసారి హాంగ్‌జౌలో మనవాళ్ళు ఏకంగా 111 పతకాలు సాధించి, అయిదో స్థానానికి ఎగబాకారు. రానున్న ప్యారిస్ పారాలింపిక్స్ పట్ల ఆశలు పెంచారు. చైనా గెల్చిన 521 పతకాలతో పోలిస్తే, మన సాధన చిన్నదే కావచ్చు. అయితే, దేశంలో అథ్లెట్లతో పాటు పారా అథ్లెట్లూ పెరుగుతూ, క్రీడాంగణాన్ని వెలిగిస్తున్న వైనం మాత్రం అవిస్మరణీయం.
ఈ పారా – అథ్లెట్ల భారత బృందం సాధించిన 111 పతకాలకూ వెనుక 111 స్ఫూర్తి కథనాలున్నాయి. చేతులు లేకపోతేనేం, విలువిద్యలో దిట్ట అయిన కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ళ శీతల్ దేవి తన పాదాలతోనే బాణాన్ని సంధించి, లక్ష్యాన్ని ఛేదించి, పతకం సాధించిన తీరు వైరల్ అయింది. నిరాశలో కూరుకున్న కోట్లమందికి ఆమె సరికొత్త స్ఫూర్తి ప్రదాత. అలాగే, ఒకప్పుడు రెజ్లర్‌గా ఎదుగుతూ, రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోగొట్టుకున్న సుమిత్ అంతిల్ మరో ఉదాహరణ.
జీవితంలో పూర్తిగా నిస్పృహలో జారిపోయిన ఆ ఆటగాడు కన్నతల్లి ప్రోత్సాహంతో, అప్పటి దాకా విననైనా వినని పారా క్రీడల్లోకి దిగారు. ఇవాళ జావెలిన్ త్రోయర్‌గా పారాలింపిక్స్‌కు వెళ్ళారు. ఏషియన్ ఛాంపియన్‌గా ఎదిగారు. తాజా క్రీడోత్సవాల్లో తన ప్రపంచ రికార్డును తానే మెరుగుపరుచుకున్నారు. సోదరుడి వివాహంలో కరెంట్ షాక్‌తో చేతులు రెండూ కోల్పోయిన పారా స్విమ్మర్ సుయశ్ నారాయణ్ జాధవ్, కుడి మోచేయి లేని పరుగుల వీరుడు దిలీప్, నడుము కింది భాగం చచ్చుబడినా తొణకని కనోయింగ్ వీరుడు ప్రాచీ యాదవ్... ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు.
పారా క్రీడల విషయంలో గతంలో పరిస్థితి వేరు. దేశంలో పారా క్రీడలకు పెద్ద తలకాయ అయిన భారత పారా ఒలింపిక్ కమిటీ అనేక వివాదాల్లో చిక్కుకుంది. 2015లో అంతర్జాతీయ పారా లింపిక్ కమిటీ సస్పెండ్ చేసింది. ఆ పైన 2019లో జాతీయ క్రీడా నియమావళిని ఉల్లంఘించారంటూ, సంఘం గుర్తింపును క్రీడా శాఖ రద్దు చేసింది. ఏడాది తర్వాత పునరుద్ధరించింది. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి ఆరోపణలు సరేసరి. అన్ని అవరోధాల మధ్య కూడా ఆటగాళ్ళు పట్టుదలగా ముందుకు వచ్చారు. ఒకప్పుడు నిధులు, శిక్షణ కొరవడిన దశ నుంచి పరిస్థితి మారింది. ప్రత్యేక అవసరాలున్న ఆటగాళ్ళకు నిధులు, శిక్షణనివ్వడంలో శ్రద్ధ ఫలిస్తోంది.
భారత క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన పలు కేంద్రాల్లో భారత పారా అథ్లెట్లకు మునుపటి కన్నా కొంత మెరుగైన శిక్షణ లభిస్తోంది. విదేశీ పర్యటనలతో వారికి క్రీడా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఆటగాళ్ళ దీక్షకు తల్లితండ్రులు, కోచ్‌ల ప్రోత్సాహం తోడై పతకాల పంట పండిస్తోంది. పారా స్పోర్ట్స్ అంటే ఎవరికీ పెద్దగా తెలియని రోజుల నుంచి దివ్యాంగులు పలువురు క్రీడల్ని ఓ కెరీర్‌గా ఎంచుకొనే రోజులకు వచ్చాం. అయితే, ఇది చాలదు. వసతుల్లో, అవకాశాల్లో సాధారణ ఆట గాళ్ళతో పాటు దివ్యాంగులకూ సమప్రాధాన్యమివ్వాలి. దేశంలోని దివ్యాంగ క్రీడాకారుల్లోని ప్రతిభా పాటవాలు బయటకు తేవాలి. 9 నెలల్లో రానున్న ప్యారిస్ పారాలింపిక్స్‌కి అది చేయగలిగితే మేలు!
దివ్యమైన పతకాల పంట
Published Wed, Nov 1 2023 3:42 AM | Last Updated on Wed, Nov 1 2023 3:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment