కోవిడ్ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏర్పాటుకానున్న 1,500 లకు పైగా పీఎస్‌ఏ (ప్రెజర్ స్వింగ్ అడ్సోర్ప్సన్) ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా పనిచేసేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కూడా సూచిం చారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు పీఎం కేర్స్ ఫండ్, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో నిర్మితమవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పీఎం కేర్స్ ఫండ్ సహకారం అందించే పీఎఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వస్తు న్నాయని, ఇవి పనిచేయడం ప్రారంభించాక 4 లక్షలకు పైగా ఆక్సిజన్ లభ్యత ఉన్న పడకలు అందుబాటులోకి వస్తాయని ప్రధాన మంత్రికి అధికారులు వివరించారు.
ప్రతి జిల్లాలోనూ..
ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. నిపుణులు తయారుచేసిన శిక్షణా మాడ్యూల్ అమల్లో ఉందని, దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మందికి శిక్షణ ఇవ్వాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రధానికి అధికారులు తెలియజేశారు. స్థానిక, జాతీయ స్థాయిలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, పనితీరు తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)æ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రధానమంత్రి సూచించారు.
పలు దేశాల్లో ల్యామ్డా ప్రభావం
ల్యా్డమ్డా పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిం చడం ప్రారంభమైందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. అయితే ఇలాంటి వేరియంట్‌లతో మనం జాగ్రత్తగా ఉండాలని వీకే పాల్ సూచించారు. గర్భిణీ స్త్రీలలో కోవిడ్ తీవ్రత పెరుగుతుందని, అందువల్ల గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్లు వేయడం అవసరం అని వీకే పాల్ అన్నారు. గర్భిణీలకు కరోనా ఉంటే, అకాల డెలివరీ ప్రమాదం పెరుగుతుందని సూచించారు.
కోవిడ్ ప్రొటోకాల్స్‌కు తూట్లు..
మరోవైపు సంక్రమణ వేగం తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్‌లాక్ ప్రక్రియలను మొదలుపెట్టాయి. దీంతో కరోనా విషయంలో ప్రజల్లో ఒకరకమైన అలసత్వం ఆవహించింది. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు మార్కెట్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఒకరికొకరు కనీస దూరం పాటించకపోవడం కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాల్సిందేనన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అదే సమయంలో మాస్క్ ధరించడంతో పాటు, సామాజిక దూరాన్ని పాటించడం అనేది కేవలం నియమం మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలని నిపుణులు సైతం స్పష్టంచేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ పర్యాటక ప్రదేశాల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరోసారి హెచ్చరిక జారీ చేసింది.
దేశంలో ‘ల్యామ్డా’ జాడల్లేవు
దేశంలో కోవిడ్ వేరియంట్ ల్యామ్డాకు సంబంధించిన కేసులు ఇప్పటి వరకు బయటపడలేదని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సార్స్‌కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) ఈ వేరియంట్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోందని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మీడియాతో అన్నారు. డబ్ల్యూహెచ్‌వో జూన్ 14వ తేదీన పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించిన 7వ వేరియంట్ ల్యామ్డా అని ఆయన చెప్పారు. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. దీని జాడలు దాదాపు 25 దేశాల్లో బయటపడ్డాయి. పెరూలో 80% కేసులు ఈ వేరియంట్‌వే. ల్యామ్డా వేరియంట్‌కు సంబంధించి 27 కేసులను గుర్తించినట్లు కెనడా అధికారులు తెలిపారు.
థర్డ్ వేవ్‌ని మనమే ఆహ్వానిస్తున్నామా...?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవ దృశ్యాలు ఇంకా చెరిగిపోక ముందే థర్డ్ వేవ్ రూపంలో మరో ఉపద్రవాన్ని ఆహ్వానించేందుకు దేశవాసులు సిద్ధమౌతున్నారు. గతేడాది కరోనా సంక్రమణ ప్రారంభమైన తర్వాత రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయిన మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను మరోసారి తుంగలో తొక్కడం ప్రారంభమైంది. దేశంలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు, సంక్రమణ వ్యాప్తికి కళ్ళెం వేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే వ్యాక్సిన్ డోస్ తీసుకున్న వారిలో కరోనా విషయంలో భయం తగ్గడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్స్ విషయంలో నిర్లక్ష్య జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కప్పా వేరియంట్ కనిపిస్తోంది...
కోవిడ్–19 కప్పా వేరియంట్ జాడలు దేశంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే వెలుగులోకి వచ్చినట్లు వీకే పాల్ తెలిపారు. తక్కువ తీవ్రత ఉండే ఈ వేరియంట్ దాదాపు డెల్టా వేరియంట్ లక్షణాలనే కలిగి ఉంటుందన్నారు. దేశంలో సెకం డ్ వేవ్‌కు కారణమైన డెల్టా వ్యాప్తి త్వరితంగా జరగడంతో కప్పా ఉనికి కనుమరుగైందన్నారు. ఈ వేరియంట్ కూడా డబ్ల్యూహెచ్‌వో పరిశీలనలో ఉందన్నారు. యూపీలో కప్పావేరియంట్ సంబంధిత 2 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment