వర్షంలో ‘సన్‌రైజ్’
నాటకీయ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం .... డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఓడిన ఢిల్లీ
కాసేపు 20 ఓవర్ల మ్యాచ్... అంతలోనే మళ్లీ 12 ఓవర్లకు మార్పు... మళ్లీ ఐదు ఓవర్లకు కుదింపు.. వర్షం కారణంగా నాటకీయంగా ఓవర్లు మారిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గట్టెక్కింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
న్యూఢిల్లీ: రాజస్థాన్‌పై విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు... మరోసారి సమష్టిగా రాణించి ఢిల్లీపైనా విజయాన్ని అందించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో హైదరాబాద్ నెగ్గింది. సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), పీటర్సన్ (19 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టెయిన్(2/20)తో పాటు మిశ్రా (2/23), హెన్రిక్స్ (2/26) ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆ తర్వాత పలుమార్లు వర్షం ఆటంకం కల్గించడంతో చివరికి సన్‌రైజర్స్ లక్ష్యాన్ని 5 ఓవర్లలో 43 పరుగులుగా నిర్దేశించారు. హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నమన్ ఓజా (13 నాటౌట్), వార్నర్ (12 నాటౌట్) జట్టు విజయాన్ని పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) రాహుల్ (బి) స్టెయిన్ 7; పీటర్సన్ (సి) ధావన్ (బి) మిశ్రా 35; అగర్వాల్ (సి) వార్నర్ (బి) మిశ్రా 25; కార్తీక్ (సి) స్టెయిన్ (బి) హెన్రిక్స్ 39; శుక్లా (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 21; డుమిని (బి) భువనేశ్వర్ 4; జాదవ్ (సి) పఠాన్ (బి) స్టెయిన్ 5; రాహుల్ శుక్లా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) : 143.
వికెట్ల పతనం: 1-10; 2-54; 3-73; 4-128; 5-132; 6-139; 7-143.
బౌలింగ్: స్టెయిన్ 4-0-20-2; భువనేశ్వర్ 4-0-23-1; కరణ్ శర్మ 3-0-29-0; హెన్రిక్స్ 3-0-26-2; మిశ్రా 3-0-23-2; పఠాన్ 3-0-18-0.
హైదరాబాద్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) రాహుల్ శుక్లా 4; ధావన్ (సి) డుమిని (బి) కౌల్ 4; వార్నర్ నాటౌట్ 12; నమన్ ఓజా నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (4.2 ఓవర్లలో 2 వికెట్లకు) : 44.
వికెట్ల పతనం: 1-13; 2-25.
బౌలింగ్: షమీ 1-0-6-0; కౌల్ 1-0-5-1; తాహిర్ 1-0-7-0; రాహుల్ శుక్లా 1-0-13-1; లక్ష్మిరతన్ శుక్లా 0.2-0-7-0.
మ్యాచ్ సాగిందిలా...
తొలుత మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం 20 ఓవర్లే. స్టెయిన్ బౌలింగ్‌లో డికాక్ అవుటైనా... ఢిల్లీ కెప్టెన్ పీటర్సన్ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 52 పరుగులు వచ్చాయి. అయితే అమిత్ మిశ్రా తన వరుస ఓవర్లలో పీటర్సన్, మయాంక్ అగర్వాల్‌లను అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కార్తీక్, శుక్లా నిలకడగా ఆడటంతో ఢిల్లీ 13.1 ఓవర్లలో 103/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను ఆపేశారు.
75 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగినా ఓవర్లు కుదించకుండా మ్యాచ్‌ను కొనసాగించారు. దీంతో మళ్లీ వచ్చిన ఢిల్లీ మిగిలిన ఓవర్లు ఆడింది. నాలుగో వికెట్‌కు శుక్లా, కార్తీక్ కలిసి 55 పరుగులు జోడించాక... హెన్రిక్స్ బౌలింగ్‌లో ఈ ఇద్దరూ అవుటయ్యారు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్, స్టెయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటంతో మ్యాచ్‌కు మరోసారి అంతరాయం ఏర్పడింది. దాదాపు అరగంట పాటు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను కుదించారు. సన్‌రైజర్స్‌కు 15 ఓవర్లలో 117 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ధావన్, ఫించ్ కలిసి 1.1 ఓవర్లలో 11 పరుగులు చేశాక మళ్లీ వర్షం వచ్చింది.
దీంతో మరోసారి ఓవర్లను కుదించారు. లక్ష్యాన్ని 12 ఓవర్లలో 97 పరుగులుగా నిర్దేశించారు. బ్యాట్స్‌మెన్ వచ్చి మరో ఐదు బంతులు ఆడగానే మళ్లీ వర్షం పడింది. ఈ ఐదు బంతుల వ్యవధిలోనే ధావన్ అవుటయ్యాడు. మ్యాచ్ ఆగే సమయానికి సన్‌రైజర్స్ స్కోరు 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 17.
మరో 20 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈసారి లక్ష్యం మళ్లీ మారింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం హైదరాబాద్ ఐదు ఓవర్లలో 43 పరుగులు చేయాలి. అప్పటికి 2 ఓవర్లలో 17 చేశారు. అంటే ఇక మూడు ఓవర్లలో 26 పరుగులు చేయాలి.
ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో హైదరాబాద్ జట్టు తాహిర్ బౌలింగ్‌లో 7 పరుగులు రాబట్టింది. ఆ తర్వాతి ఓవర్‌లో ఫించ్ ధాటిగా ఆడే ప్రయత్నంలో రాహుల్ శుక్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే వార్నర్ ఓ ఫోర్, నమన్ ఓజా ఓ సిక్స్ కొట్టడంతో నాలుగో ఓవర్‌లో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా... లక్ష్మిరతన్ శుక్లా బౌలింగ్‌లో తొలి బంతికి వార్నర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి ఓజా సిక్సర్ బాది సన్‌రైజర్స్ విజయాన్ని ఖాయం చేశాడు.