ఇకనైనా ‘డేర్’ పెరిగేనా !
ఢిల్లీ డేర్ డెవిల్స్...
ఓనర్: జీఎంఆర్; కెప్టెన్: కెవిన్ పీటర్సన్
కోచ్: గ్యారీ కిర్‌స్టెన్
గత ఉత్తమ ప్రదర్శన:
సెమీఫైనల్ (2008, 2009, 2012(ప్లే ఆఫ్))
కీలక ఆటగాళ్లు: పీటర్సన్, టేలర్, డుమినీ, దినేశ్ కార్తీక్, విజయ్, మహ్మద్ షమీ
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఈ సామెత ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు అతికినట్లుగా సరిపోతుంది.. ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ గత ఆరు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2008, 2009లో సెమీఫైనల్స్‌కు.. 2012లో ప్లే ఆఫ్ దశకు చేరుకున్నా అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో విసిగి వేసారిపోయిన డెవిల్స్ యాజమాన్యం జట్టులో ఉన్న ఆటగాళ్లందరినీ వదిలించుకుంది.
ఆ తర్వాత వేలం పాటలో కోట్లు కుమ్మరించి మరీ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని విధంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను రూ. 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్‌ను రూ. 9 కోట్లకు, మురళీ విజయ్ రూ. 5 కోట్లకు దక్కించుకుంది. మొత్తానికి గతాన్ని మరిచిపోయి కొత్త లుక్‌తో ఐపీఎల్-7లో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను సారథిగా నియమించింది.
భారమంతా కిర్‌స్టెన్‌పైనే...
భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి.. విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న కిర్‌స్టెన్ తొలిసారిగా ఐపీఎల్‌లో కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. గతంలో భారత్ లాగే ఇప్పుడు ఢిల్లీ జట్టును కూడా విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని జీఎంఆర్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది. ఇక ఢిల్లీ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి కిర్‌స్టెన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.
బలాలు...
భారత క్రికెటర్లు, విదేశీ ప్లేయర్లు, దేశవాళీ ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ పీటర్సన్ సీజన్ మొత్తం అందుబాటులో ఉండటం.. విజయవంతమైన కోచ్‌గా కిర్‌స్టెన్‌కు పేరుండటం.. ఈ జట్టు బలాలు..
బలహీనతలు...: కొద్దిమంది ఆటగాళ్లు మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా ఈ జట్టుకు కొత్త.. ఇది మినహాయిస్తే డెవిల్స్‌కు పెద్దగా బలహీనతలేమీ లేవు.
జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, మహ్మద్ షమీ, మనోజ్ తివారీ, జయ్‌దేవ్ ఉనాద్కట్, రాహుల్ శర్మ, లక్ష్మీ రతన్ శుక్లా, సౌరవ్ తివారీ.
విదేశీ క్రికెటర్లు: కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్), జీన్‌పాల్ డుమినీ, క్వింటన్ డికాక్, వేన్ పార్నెల్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, జేమ్స్ నీషామ్(న్యూజిలాండ్), నాథన్ కౌల్టర్ నైల్ (ఆస్ట్రేలియా),
భారత దేశవాళీ క్రికెటర్లు: కేదార్ జాదవ్, మయంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, రాహుల్ శుక్లా, జయంత్ యాదవ్, హెచ్. ఎస్. శరత్, మిలింద్ కుమార్.