
మెస్సీని మూసేసినా... స్విస్‌కు నిరాశే
స్విట్జర్లాండ్ బ్రహ్మాండమైన స్కెచ్ గీసింది. అర్జెంటీనా బలం మెస్సీని కదలనీయకుండా ఉచ్చు బిగించింది. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు డిఫెండర్లు మ్యాచ్ ఆసాంతం మెస్సీని చుట్టు ముట్టి ఊపిరి ఆడనీయకుండా నిలువరించారు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఈసారీ అదే వ్యూహంతో స్విస్ జాగ్రత్తపడింది. అయినా మెస్సీ పాదరసంలా కదిలాడు. తనకు అవకాశం లేదని తెలుసుకుని... తెలివిగా సహచరులకు పాస్‌లు ఇస్తూ నడిపించాడు. ఇదే క్రమంలో తను వ్యూహాత్మకంగా అందించిన పాస్‌ను డి మారియా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఫలితం... ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా క్వార్టర్స్‌కు చేరింది.
సావో పాలో: లియోనల్ మెస్సీ మాయతో ఈసారి కచ్చితంగా ఫిఫా ప్రపంచకప్‌ను సాధిద్దామనుకుంటున్న అర్జెంటీనా అందుకు తగినట్టుగానే ముందుకెళుతోంది. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ శాయశక్తులా పోరాడి అర్జెంటీనాను అడ్డుకున్నా... గోల్ కీపర్ బెనగ్లియో గోడలా నిలబడ్డా... చివరి క్షణాల్లో తేలిపోయింది. ఇప్పటిదాకా ప్రతీ మ్యాచ్‌లో గోల్ చేసి జట్టును గెలిపించిన మెస్సీ.. ఈసారి తన అద్భుత పాస్‌తో జట్టును గట్టెక్కించాడు. ఫలితంగా 1-0తో నెగ్గి అర్జెంటీనా క్వార్టర్స్‌కు చేరింది. మ్యాచ్ 118వ నిమిషం (అదనపు సమయం)లో డి మారియా అర్జెంటీనా తరఫున గోల్ చేశాడు. మొత్తానికి ప్రపంచకప్ నాకౌట్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ అభిమానులకు కనువిందు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మెస్సీకి దక్కింది.
* ఆరంభంలో ఇరు జట్లు నెమ్మదిగానే కదిలాయి. 25 నిమిషాల దాకా ఒక్క జట్టు కూడా లక్ష్యం దిశగా సాగలేదు.
* 28వ నిమిషంలో స్విస్ తొలిసారి దాడికి దిగింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ షాకిరి బంతిని డ్రిబుల్ చేసుకుంటూ అందించిన పాస్‌ను పెనాల్టీ ఏరియా దగ్గరి నుంచి మరో మిడ్ ఫీల్డర్ హాకా గోల్ పోస్టులోకి షాట్ కొట్టగా అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరో అడ్డుకున్నాడు.
* 31వ నిమిషంలో అర్జెంటీనా స్ట్రయికర్ లవెజ్జి పది గజాల దూరం నుంచి తక్కువ ఎత్తులో కొట్టిన షాట్ అంత బలంగా రాకపోవడంతో స్విస్ కీపర్ బెనగ్లియో సులువుగానే పట్టేశాడు.
* 36వ నిమిషంలో లవెజ్జిని అడ్డుకున్నందుకు స్విస్ మిడ్‌ఫీల్డర్ హాకా మ్యాచ్‌లో తొలి ఎల్లో కార్డుకు గురయ్యాడు.
* 39వ నిమిషంలో స్విస్‌కు మంచి అవకాశం లభించినా విఫలమైంది. స్ట్రయికర్ జోసెఫ్ డ్రిమ్క్ నేరుగా కొట్టిన షాట్.. కీపర్ రొమెరో చేతుల్లోకి వెళ్లింది.
* ఆ తర్వాత కూడా ఎలాంటి ఫలితం రాకపోవడంతో 0-0తో ప్రథమార్ధం ముగిసింది. 60 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా అర్జెంటీనా గోల్ చేయలేకపోయింది. మరోవైపు స్విస్ డిఫెండర్లు మెస్సీని నియంత్రించడంలో విజయం సాధించారు.
* 50వ నిమిషంలో స్విస్ ఆటగాడు షాకిరి ఫ్రీకిక్‌ను నేరుగా గోల్ కీపర్ పట్టుకున్నాడు.
* 59వ నిమిషంలో అర్జెంటీనా డిఫెండర్ మార్కోస్ రోజో కొట్టిన షాట్ గోల్ కీపర్ చేతుల్లోకి వెళ్లి బయటికి వచ్చినప్పటికీ అక్కడ తమ ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో చాన్స్ మిస్ అయ్యింది.
* 62వ నిమిషంలోనూ అర్జెంటీనా స్ట్రయికర్ గోంజలో హిగువాన్ హెడర్ షాట్‌ను చివరి నిమిషంలో కీపర్ ఎగిరి చేత్తో అడ్డుకోవడంతో బంతి బార్ పైనుంచి వెళ్లిపోయింది.
* 67వ నిమిషంలో బంతిని మెస్సీ తన చాతీతో నియంత్రించుకుని నేరుగా కొట్టిన వ్యాలీ స్వల్ప తేడాతో గోల్ పోస్టుపై నుంచి వెళ్లింది.
* 78వ నిమిషంలోనూ మెస్సీ పరిగెత్తుతూ స్విస్ ఏరియాలోకి వచ్చి కొట్టిన షాట్ కూడా విఫలమైంది. ఆ తర్వాత కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది.
* 94వ నిమిషంలో పలాసియో హెడర్‌ను స్విస్ గోల్ కీపర్ వ మ్ము చేశాడు.
* 109వ నిమిషంలో డి మారియా షాట్‌ను ఎడమవైపు డైవ్ చేస్తూ స్విస్ కీపర్ పైకి నెట్టాడు.
* 118వ నిమిషంలో మెస్సీ పిచ్ మధ్యలో నుంచి పరిగెత్తుతూ కుడి వైపు ఇచ్చిన పాస్‌ను డి మారియా గురి తప్పకుండా నెట్‌లోకి కొట్టి అర్జెంటీనా శిబిరాన్ని ఆనందంలో నింపాడు.
* ఇంజ్యూరీ సమయంలో స్విస్ ఆటగాడు జెమాలీ హెడర్ షాట్ గోల్ పోస్ట్ ఎడమ బార్‌ను తగిలి బయటకు వచ్చింది. చివర్లో తమకు లభించిన ఫ్రీకిక్ కూడా విఫలం కావడంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది.
ప్రపంచకప్‌లో బుధ, గురువారాలు మ్యాచ్‌లు లేవు. శుక్ర, శనివారాల్లో క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి.