భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన మాటల్ని, సూచనల్ని తప్పుగా అర్థం చేసుకుంటోందని డబుల్స్ స్టార్ గుత్తాజ్వాల వాపోయింది. కేవలం విమర్శించినంత మాత్రాన జీవితకాల నిషేధం విధిస్తారా అని ఆమె ప్రశ్నించింది.
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన మాటల్ని, సూచనల్ని తప్పుగా అర్థం చేసుకుంటోందని డబుల్స్ స్టార్ గుత్తాజ్వాల వాపోయింది. కేవలం విమర్శించినంత మాత్రాన జీవితకాల నిషేధం విధిస్తారా అని ఆమె ప్రశ్నించింది. ‘ముక్కుసూటిగా మాట్లాడటం నా నైజం. నా మాటల్లో తప్పేముంది.
ఇంతదానికే నిషేధమంటే హాస్యాస్పదంగా లేదు! నేనేమీ కల్పించుకొని చెప్పలేదు... కల్పితాలు చెప్పలేదు’ అని పేర్కొంది. ‘బాయ్’ తనను ఎందుకు శత్రువుగా చూస్తుందో అర్థం కావడం లేదని ఆమె చెప్పింది. ‘బ్యాడ్మింటనే నా లోకం. ఇందులో ఉన్నతస్థాయికి ఎదగాలనేదే నా ఆశయం.
దీని కోసం నేను రోజుకు 8 గంటలు కష్టపడతా. నాకు తెలిసిందల్లా బ్యాడ్మింటన్ ఆడటమే. రాజకీయాలు చేయడం రాదు. నేను ఎవరికైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నానని వారనుకుంటే ఇంతకుమించిన మూర్ఖత్వం మరోటి లేదు’ అని ఆమె చెప్పింది. సద్విమర్శల్ని అర్థం చేసుకునేవారు క్రీడా సమాఖ్యలో లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని జ్వాల పేర్కొంది. ‘ఇది నా క్రీడ. దీనిపై సూచనలిచ్చే హక్కు నాకుంది. బ్యాడ్మింటన్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. ఈ క్రీడకోసమే నా తపనంతా’ అని చెప్పింది.