మారేడుపల్లి: ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదగాలనేది తన లక్ష్యమని హైదరాబాద్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు వెల్లడించింది. చిన్నతనంలో భారత్‌కు ఆడాలనేది తన కల అని, ప్రస్తుతం ప్రపంచాన్ని జయించడమే తన ధ్యేయమని పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ శానిటరీ నాప్కిన్ బ్రాండ్ స్టేఫ్రీ సంస్థ ఆక్సిలియం హైస్కూల్‌లో ‘డ్రీమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆక్సిలియం స్కూల్ విద్యార్థి అయిన సింధు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో చర్చాగోష్టిలో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. నెలసరి అనేది శరీర సహజ ధర్మమని... అమ్మాయిలు ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో కెరీర్‌లో ముందడుగు వేయాలని సూచించింది. మహిళలు తమ శక్తిపై నమ్మకముంచాలని పేర్కొంది. తన తల్లి విజయ తనకు స్ఫూర్తిప్రదాత అని చెప్పింది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా విజయం అందుకోలేమని... పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకు సాగడమే ఇందుకు పరిష్కారమని సూచించింది. ఇతరులను గౌరవించడం, క్రమశిక్షణ అనే విలువల్ని ఈ పాఠశాలలోనే నేర్చుకున్నానన్న సింధు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పేర్కొంది. విజయానికి నిరంతర కృషి ఒక్కటే మార్గమని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది.
Comments
Please login to add a commentAdd a comment