
శ్రీలంక విజయలక్ష్యం 405
శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 405 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోల్ కతా: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 405 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి డబుల్ సెంచరీ (264) చేయడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలుత రెండు వికెట్లు ఆదిలోనే కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించిన టీమిండియాను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదుకున్నారు.
రోహిత్ కు కోహ్లీ జతకలవడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులెత్తింది. విరాట్ కోహ్లీ(66) పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన అనంతరం రోహిత్ మరింత రెచ్చిపోయాడు. తొలుత హాఫ్ సెంచరీ చేయడానికి సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. వంద స్ట్రైక్ రేట్ తో వంద పరుగులు పూర్తి చేశాడు. అదే వేగంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్.. వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న 219 రికార్డును అధిగమించాడు.
కేవలం 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్స్ ల సాయంతో 264 పరుగులను పూర్తి చేసిన రోహిత్.. చివరి బంతికి అవుటయ్యాడు. టీమిండియా ఆటగాళ్లలో అజ్యింకా రహానే (28), అంబటి రాయుడు (8), సురేష్ రైనా(11), రాబిన్ ఉతప్ప(16) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లో కోల్పోయిన టీమిండియా 404 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ కు రెండు వికెట్లు లభించగా, కులశేఖర, ఎరంగాలకు తలో వికెట్టు దక్కింది.