ఇంగ్లండ్ పై టీమిండియా ఘనవిజయం
నాటింగ్ హమ్:టెస్టుల్లో ఘోరంగా చతికిలబడ్డ టీమిండియా.. వన్డేల్లో చెలరేగిపోతోంది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకుంటూ ఇంగ్లండ్ పై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 227 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం 228 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇండియా 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్ శిఖర్ థావన్(16) పరుగులకే పెవిలియన్ కు చేరినా, మరో ఓపెనర్ అజాంకే రహానే(45)పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తరువాత మిడిల్ ఆర్డర్ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(40), సురేష్ రైనా(42) పరుగులు చేశారు. ఈమ్యాచ్ లో ఆకట్టుకున్న అంబటి రాయుడు (62), జడేజా(12)పరుగులతో నాటౌట్ గా మిగిలి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో కెప్టెన్ కుక్(44),హేల్స్(42),బట్లర్ (42),బెల్ (28) పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు లభించగా, భువనేశ్వర్ కుమార్, షమీ,రైనా, రాయుడు, జడేజాలకు తలో వికెట్టు దక్కింది.