హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూతనందించేందుకు పలువురు ప్రముఖ క్రీడాకారులు ముందుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ విభాగం 70 కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రాగా, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాలు సైతం తమవంతు సాయం అందివ్వడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు సానియా తల్లి నసీమా మీర్జా మూడు లక్షల రూపాయిల చెక్కును ఎంపీ కవితకు అందజేయగా, గుత్తా జ్వాల లక్ష రూపాయిల చెక్కును రైతు కుటుంబాలకు సాయంగా ఇచ్చారు. కాగా, తాను కూడా రైతు కుటుంబాలకు సాయం అందించడంలో భాగం అవుతానని ప్రజ్ఞాన్ ఓజా స్పష్టం చేశాడు. దేశానికి వెన్నుముకగా భావించే రైతును ఆదుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నాడు.
దీనిలో భాగంగా సానియా తల్లి నసీమా మీర్జా మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు, భూకంపాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రతీ ఒక్కరూ తమ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.రైతు కుటుంబాలకు సాయం అందివ్వడానికి సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ముందుకు రావాలని జ్వాల తెలిపారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆమె తెలిపారు.