గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం తెలంగాణకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్ గౌడ్–బొక్కా నవనీత్ ద్వయం విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. ఫైనల్లో విష్ణువర్ధన్–నవనీత్ (తెలంగాణ) జంట 18–21, 21–13, 21–15తో మంజిత్–డింకూ సింగ్ (మణిపూర్) జోడీపై గెలిచింది. టెన్నిస్ అండర్–21 బాలుర డబుల్స్ విభాగంలో తీర్థ శశాంక్–గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ద్వయం రజతం నెగ్గింది.
ఫైనల్లో శశాంక్–సాయికార్తీక్ జోడీ 3–6, 1–6తో పరీక్షిత్ సోమాని–షేక్ ఇఫ్తెకార్ (అస్సాం) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. టెన్నిస్ అండర్–21 బాలికల సింగిల్స్ విభాగంలో సామ సాత్విక (తెలంగాణ) రజతం దక్కించుకుంది. దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్ చాంపియన్ అయిన సాత్విక ఫైనల్లో 3–6, 1–6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి చవిచూసింది. టెన్నిస్ అండర్–17 బాలికల సింగిల్స్‌లో సంజన సిరిమల్ల (తెలంగాణ) కాంస్యం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో సంజన 6–0, 7–5తో కుందన (తమిళనాడు)పై గెలిచింది. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో 15వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment