వారియర్స్ ఓటమి | Telugu Warriors lost game with karnataka bulldozers | Sakshi
Sakshi News home page

వారియర్స్ ఓటమి

Published Sun, Feb 16 2014 2:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వారియర్స్ ఓటమి - Sakshi

వారియర్స్ ఓటమి

 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ తరహాలో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో తెలుగు వారియర్స్ చేతులెత్తేసింది. సెమీస్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లో బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. తద్వారా ఈసారి కూడా టైటిల్ గెలవకుండానే నిష్ర్కమించింది.
 
శనివారం లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్‌డోజర్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. దీంతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలతో సెమీస్‌కు చేరకుండానే నిష్ర్కమించినట్టయ్యింది. కర్ణాటక ఇంతకుముందే సెమీస్‌కు చేరింది.
 
 ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్... అఖిల్ (46 బంతుల్లోనే 90; 7 ఫోర్లు; 4 సిక్స్) అద్భుత ఆటతీరుతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 190 పరుగులు చేసింది. ప్రొఫెషనల్ ఆటగాడిని తలపించే స్థాయిలో అఖిల్ మైదానం నలువైపులా బౌండరీల మోత మోగించాడు. అన్ని రకాల షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపాడు. అంతకుముందు ఓపెనర్లు ప్రిన్స్ (39 బంతుల్లో 50; 1 ఫోర్; 1 సిక్స్), సుధీర్ బాబు (34 బంతుల్లో 41; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు.
 
 ఆ తర్వాత బరిలోకి దిగిన అఖిల్ వచ్చీ రావడంతోనే జోరు చూపించాడు. 8వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన తను దుమ్మురేపే ఆటతీరుతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సిక్సర్లతో స్కోరును రాకెట్ వేగంతో తీసుకెళ్లాడు.  
 
 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 194 పరుగులు చేసి నెగ్గింది. తొలి ఓవర్‌లోనే వికెట్ పడింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ధృవ్ (50 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు) ఏమాత్రం బెదరకుండా లక్ష్యం వైపు జట్టును నడిపించాడు. కచ్చితమైన షాట్లతో విరుచుకుపడుతూ స్కోరును గాడిన పెట్టాడు. రాజీవ్ (21 బంతుల్లో 53; 1 ఫోర్; 7 సిక్స్) రాకతో ఆట స్వరూపమే మారిపోయింది. 19వ ఓవర్‌లో తను అవుట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్‌లో 5 పరుగులు కావాల్సిన దశలో అఖిల్ కట్టుదిట్టంగా బంతులు విసిరినా భాస్కర్ (8) ఓ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement