సెమీస్‌కు చేరువలో...
తెలుగు టైటాన్స్‌కు ఏడో విజయం
♦ 22 పాయింట్లతో పట్నా చిత్తు
♦ బెంగాల్‌పై బెంగళూరు విజయం
సాక్షి, హైదరాబాద్ : సొంతగడ్డపై చెలరేగిన తెలుగు టైటాన్స్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్‌కు చేరువైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 54-32 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. పట్నాను టైటాన్స్ ఏకంగా నాలుగుసార్లు ఆలౌట్ చేయడం విశేషం. అలాగే ఈ సీజన్‌లో తొలిసారి 50 పాయింట్లు చేసిన జట్టుగా టైటాన్స్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 39 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
సూపర్ కెప్టెన్: టాస్ గెలిచిన తెలుగు టైటాన్స్ కోర్టును ఎంచుకుంది. ఆరంభంలో రాహుల్, దీపక్ రైడింగ్‌తో టైటాన్స్ వరుస పాయింట్లు సాధించి 5-0తో ఆధిక్యంలో నిలిచింది. సురేశ్ కుమార్ సూపర్ ట్యాకిల్‌తో పైరేట్స్ పాయింట్ల బోణీ చేసింది. అయితే ఆ తర్వాత డిఫెన్స్‌లోనూ అద్భుతంగా రాణించడంతో టైటాన్స్ జట్టుకు తిరుగు లేకుండా పోయింది. తొలి పది నిమిషాల్లోనే ప్రత్యర్థిని టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. 17వ నిమిషంలో తెలుగు కెప్టెన్ మిరాజ్ సూపర్ రైడ్‌తో అద్భుతం చేశాడు. అతను ఈ రైడ్‌లో ఏకంగా 4 పాయింట్లు కొల్లగొట్టాడు. ఆ వెంటనే పట్నా మూడోసారి ఆలౌట్ అయింది. 20వ నిమిషంలో మిరాజ్ మళ్లీ చెలరేగి ఇంకో సూపర్ రైడ్‌తో సత్తా చాటాడు. ఈ సారి కూడా అతను 4 పాయింట్లతో తిరిగి రావడంతో తొలి అర్ధ భాగం ముగిసే సరికి టైటాన్స్ 38-12తో ఆధిక్యంలో నిలిచింది.
కాస్త తడబాటు: రెండో అర్ధ భాగం రెండో నిమిషంలోనే టైటాన్స్ మళ్లీ చెలరేగింది. నాలుగో సారి పైరేట్స్‌ను ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే ఈ దశలో పట్నా కోలుకునే ప్రయత్నం చేసింది. భారీ ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో 33వ నిమిషంలో తెలుగు జట్టు ఆలౌట్ అయింది. అయితే ఆలౌట్ తర్వాత టైటాన్స్ మరో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడటంతో మరో విజయం జట్టు ఖాతాలో చేరింది.
బెంగాల్‌కు మరో పరాజయం: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-22 స్కోరుతో బెంగాల్‌ను ఓడించింది. తొలి అర్ధ భాగంలో 16-10తో ముందంజ వేసిన బెంగళూరు చివరి వరకు ఆధిక్యం నిలబెట్టుకుంది.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
జైపూర్ పింక్ పాంథర్స్ x యు ముంబా
రా. గం. 8 నుంచి
తెలుగు టైటాన్స్ x పుణెరి పల్టాన్
రా. గం. 9 నుంచి
స్టార్ స్పోర్ట్స్ 2 లో ప్రత్యక్ష ప్రసారం