టీమిండియాకు సడన్ సర్ ప్రైజ్
ప్రస్తుతం వెస్డిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు వెస్డిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ సడన్ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తమను కలిసేందుకు స్వయంగా రిచర్డ్స్ లాంటి దిగ్గజ ఆటగాడు రావడంతో భారత క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను సోమవారం కలవడంతో పాటు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. విండీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమతో విలువైన సమయాన్ని కేటాయించిన విండీస్ మాజీ ఆటగాడికి కోహ్లీ, రహానే, మురళీ విజయ్, రాహుల్, ధావన్, స్టూవర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలను ప్రత్యేకంగా అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీల మోత మోగించిన విరాట్ ను మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. కూల్ గా ఉంటూనే తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే రహానేను ప్రశంసించాడు. స్టూవర్ట్ బిన్నీతో మాట్లాడుతూ అతడి తండ్రి మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో పాటు 1983 ప్రపంచకప్ రోజులను రిచర్డ్స్ గుర్తుచేసుకున్నాడు.