సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌పీఎన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పీడ్‌స్టార్ పోటీల ద్వారా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పర్వీందర్ అవానా తొలి సారి వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్థాయిలో కూడా అతను అదే వేగాన్ని నమ్ముకున్నాడు. తొలిసారి ఇంగ్లండ్‌తో రెండు టి20 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది దేశవాళీలో రాణించి మళ్లీ జట్టులోకి వస్తానని అవానా విశ్వాసంతో ఉన్నాడు. ఢిల్లీ తరఫున మొయినుద్దౌలా టోర్నీలో ఆడేందుకు నగరానికి వచ్చిన అవానా చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...
సన్నాహకాలు, ఫిట్‌నెస్: ఐపీఎల్‌లో రెండేళ్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతృప్తినిచ్చింది. అయితే ఆ టోర్నీ తర్వాత మ్యాచ్‌లకు విరామం వచ్చింది. ఈ కాలంలో నేను తీవ్రంగా సాధన చేశాను. బౌలింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి సీజన్‌కు ముందు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యాను. ఇప్పుడు మొయినుద్దౌలాలో మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని భావిస్తున్నా.
భారత్ తరఫున విఫలం కావడం: నా ఐపీఎల్ ప్రదర్శనతో పాటు గత ఏడాది కర్ణాటకపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో అవకాశం కల్పించింది. అయితే ఇంగ్లండ్‌తో రెండు టి20ల్లో 100 శాతం కష్టపడినా వికెట్ దక్కకపోవడం నిరాశ కలిగించింది. టీమిండియాతో ఉన్న ఆ కొన్ని రోజులు చాలా నేర్చుకున్నాను.
జట్టులో పునరాగమనం: ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడేటప్పుడు భారత్‌కు ఎంపిక కావాలనే ఏకైక లక్ష్యం స్ఫూర్తినిచ్చేది. ఇప్పుడు ఒక సారి మళ్లీ చోటు దక్కించుకోవాలంటే అంతకు రెట్టింపు శ్రమించాలి. రంజీల్లో నిలకడగా ఆడితే భారత జట్టులో మళ్లీ స్థానం లభిస్తుందని విశ్వాసం ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీయడమే నా పని.
పేసర్లలో తీవ్రమైన పోటీ ఉండటం: నిజమే, ప్రస్తుతం భారత పేసర్లు చాలా బాగా రాణిస్తున్నారు. బ్రెట్‌లీని విపరీతంగా అభిమానించే నా ప్రధాన బలం వేగమే. గంటకు 140 కి.మీ.కు పైగా వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఇప్పటికీ భారత్‌లో ఒకరిద్దరే ఉన్నారు. నాలాంటి ఫాస్ట్ బౌలర్ అవసరం టీమ్‌కు ఉందనేది నా నమ్మకం. నా ప్రధాన లక్ష్యం కూడా టెస్టులో చోటు దక్కించుకోవడమే.
అలాంటి వేగం అవసరం ఉంది!
Published Sun, Sep 1 2013 12:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement