
టైగర్ వుడ్స్‌కు రూ. 250 కోట్లు
భారీ మొత్తానికి ‘హీరో’ ఒప్పందం
ఒర్లాండో (అమెరికా): అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌తో భారత మోటార్ బైక్ సంస్థ ‘హీరో’ కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుంది. నాలుగేళ్ల కాలానికి ఈ గోల్ఫ్ స్టార్‌కు రూ. 250 కోట్లు ఇవ్వనుంది. అమెరికాలోని ఒర్లాండోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజల్ ప్రకటించారు. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ధోని, విరాట్ కోహ్లి తదితరులకు ఏడాదికి ఒక ఒప్పందానికి రూ. 4 నుంచి 10 కోట్లు లభిస్తాయి.
క్రికెటర్లను కాదని గోల్ఫర్‌తో హీరో సంస్థ ఒప్పందం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ‘టైగర్ వుడ్స్ గోల్ఫ్ చాంపియనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో గుర్తింపు పొందినవాడు’ అని పవన్ ముంజల్ అన్నారు. భవిష్యత్‌లో ఇతర క్రీడాంశాల్లోని మేటి ఆటగాళ్లతో కూడా తమ సంస్థ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌కు వచ్చిన వుడ్స్... అక్కడి ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరవలేనన్నాడు.