ఇక చావో రేవో!
భారత్, ఇంగ్లండ్ వన్డే నేడు
గెలిచిన జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్‌కు
ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామనే ధీమాతో ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ముక్కోణపు టోర్నీలో ఒక్క విజయం కూడా లేక... తుది జట్టు కూర్పు ఎలాగో అర్థం కాక తల్లడిల్లిపోతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే తక్షణమే ఓ విజయం కావాలి.
ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం రావడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే ప్రపంచకప్‌నూ అయోమయ స్థితిలోనే ప్రారంభించాల్సి వస్తుంది.
పెర్త్: ముక్కోణపు వన్డే టోర్నీలో సెమీఫైనల్‌లాంటి పోరుకు భారత్, ఇంగ్లండ్ జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగే టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు బోనస్ పాయింట్, రన్‌రేట్‌లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఆదివారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో ఢీకొంటుంది. మ్యాచ్ గెలిస్తే భారత్‌కు ప్రపంచ కప్‌కు ముందు మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది. లేదంటే ఇక నేరుగా వరల్డ్ కప్ వార్మప్‌లకే. వర్షం లేదా మరే కారణంగా మ్యాచ్ రద్దయినా, ‘టై’ అయినా ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
కోహ్లి రాణిస్తాడా!
రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు కూడా దూరం కావడంతో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్ చెబుతున్నదాని ప్రకారం అతను మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావడం ఖాయమైంది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గట్లుగా ఆడితే ప్రపంచ కప్‌కు ముందు భారత్ శిబిరంలో పెద్ద ఆందోళన తగ్గిపోతుంది.
ధావన్ ఘోరంగా ఆడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టు అతడిని కొనసాగిస్తోంది. అయితే మరో ఓపెనర్ రహానే కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. రహానేతో పాటు మూడో స్థానంలో రాయుడు, ఆ తర్వాత రైనా కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. రద్దయిన గత మ్యాచ్‌లో ప్రకటించిన జట్టునుంచి అక్షర్‌ను తప్పించి ఉమేశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ వికెట్‌పైనైనా మన పేసర్లు ఏ మాత్రం రాణించగలరో చూడాలి.
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
మరో వైపు ఇంగ్లండ్ జట్టు భారత్‌తో గత మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తొలి లీగ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన ఆ జట్టు ఆ తర్వాత ఆసీస్ చేతిలో ఓడినా 300కు పైగా స్కోరు చేసి చివరి వరకు పోరాడింది. జట్టులో ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లోకి వచ్చారు. ఇయాన్ బెల్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా, యువ ఆటగాడు టేలర్ నిలకడగా ఆడుతున్నాడు.
అలీ, బొపారా, వోక్స్‌వంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ వికెట్ పేసర్లు ఫిన్, అండర్సన్‌లకు పండగలాంటిది. భారత్‌లాంటి జట్టును మరో సారి ఓడిస్తే ఇంగ్లండ్‌ను కూడా ప్రపంచ కప్ ఫేవరేట్లలో ఒకటిగా భావించాల్సి రావచ్చు.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, జడేజా, బిన్నీ, షమీ, ఇషాంత్, అక్షర్/ఉమేశ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, టేలర్, అలీ, రూట్, బట్లర్, బొపారా, వోక్స్, బ్రాడ్, అండర్సన్, ఫిన్.
‘ప్రస్తుతం మా అత్యుత్తమ 11 మంది ఎవరో గుర్తించాలి. అలా జరగాలంటే మొత్తం 15 మందీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలి. లేకపోతే ప్రపంచకప్‌కు ముందు ఇబ్బందిపడతాం. టాపార్డర్‌పై మాకు ఆందోళన లేదు. మిడిలార్డర్‌లో మంచి భాగస్వామ్యాలు, చివరి 10-12 ఓవర్లు బాగా ఆడటం ముఖ్యం. కొన్నిసార్లు ఆటగాళ్లు తమకు నచ్చిన బ్యాటింగ్ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. కోహ్లి నాలుగో స్థానంలో ఆడితే జట్టు సమతుల్యంగా ఉంటుంది. రెండు మంచి షాట్లు ఆడితే ధావన్ ఫామ్‌లోకి వచ్చేస్తాడు. ఇంగ్లండ్‌తో గత మ్యాచ్ ఫలితం ప్రభావం మాపై ఉండదు’. - ధోని
పిచ్, వాతావరణం
‘వాకా’పై సహజంగానే ఎక్కువ బౌన్స్ ఉంటుంది. ఈ పర్యటనలో భారత్ ఇక్కడ ఆడలేదు. మ్యాచ్ రోజు చిరుజల్లులు పడే అవకాశం ఉన్నా...ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా (37 డిగ్రీలు) ఉండవచ్చు.
ఉ.గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం