జకార్తా: ఆసియా క్రీడల చరిత్రలో పీవీ సింధు రూపంలో తొలిసారి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–17, 15–21, 21–10తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ క్రీడల చరిత్రలో ఓ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. నేడు జరిగే టైటిల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది.
తై జు యింగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–9తో వెనుకంజలో ఉంది. 2016 రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. ‘తై జు యింగ్‌తో ఫైనల్ మ్యాచ్ కోసం నా వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. టైటిల్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం’ అని సింధు వ్యాఖ్యానించింది. అంతకుముందు మరో సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ 17–21, 14–21తో తై జు యింగ్ చేతిలో ఓడిపోయింది. తై జు యింగ్ చేతిలో సైనాకిది వరుసగా 10వ ఓటమి కావడం గమనార్హం. సెమీఫైనల్లో ఓటమి పాలైన సైనా, అకానె యామగుచిలకు కాంస్య పతకాలు లభించాయి.
మహిళల సింగిల్స్ ఫైనల్
ఉ. గం.11.30 నుంచి సోనీ టెన్–2, టెన్–3, చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment