తెలుగు టైటాన్స్‌ తడబాటు | U Mumba, Bengaluru Bulls Win Openers | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌ తడబాటు

Published Sun, Jul 21 2019 5:14 AM | Last Updated on Sun, Jul 21 2019 5:14 AM

U Mumba, Bengaluru Bulls Win Openers - Sakshi

తెలుగు టైటాన్స్‌ ప్లేయర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ను పట్టేసిన యు ముంబా ఆటగాళ్లు

ప్రొ కబడ్డీ లీగ్‌ కొత్త సీజన్‌ కూడా తెలుగు టైటాన్స్‌కు నిరాశాజనకంగా ఆరంభమైంది. సొంతగడ్డపై జరిగిన ఆరంభ పోరులో మాజీ చాంపియన్‌ యు ముంబాకు టైటాన్స్‌ తలవంచింది. కీలక సమయంలో పాయింట్లు సాధించడంలో విఫలమైన తెలుగు జట్టు... చివర్లో వరుస పాయింట్లతో ప్రత్యర్థికి చేరువగా వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది.

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 31–25 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 17–10తో ఆధిక్యంలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది.  

సమష్టి వైఫల్యం...
టైటాన్స్‌ ఆటలో ఆరంభం నుంచి కూడా దూకుడు కనిపించలేదు. స్కోరు 1–1తో ఆట మొదలైన తర్వాత సిద్ధార్థ్‌ ఖాళీ రైడ్‌తో వెనక్కి రావడం మొదలు మ్యాచ్‌లో చాలా వరకు అలాంటి స్థితే కనిపించింది. ముంబా కోర్టులో ఫర్హద్‌ దొరికిపోవడంతో 4–5తో తొలిసారి వెనుకంజ వేసిన టైటాన్స్‌ మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత ముంబా ఆధిక్యం 8–5నుంచి 17–8 వరకు సాగింది. తొలి అర్ధ భాగం చివర్లో రాకేశ్, రోహిత్‌ రైడ్లతో రెండు పాయింట్లు సాధించిన తెలుగు టీమ్‌ పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్‌ ఒక సారి ఆలౌట్‌ అయింది. రెండో అర్ధభాగంలో మాత్రం టైటాన్స్‌ ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోసారి ఆలౌట్‌ అయినా కూడా టైటాన్స్‌ మొత్తం 15 పాయింట్లు సాధించగా,  ముంబా 14 పాయింట్లు మాత్రమే గెలుచుకుంది.  ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో టైటాన్స్‌కు వరుసగా పాయింట్లు వచ్చాయి. అయితే బలమైన డిఫెన్స్‌ను ప్రదర్శించిన ముంబా మ్యాచ్‌ తమ చేజారుకుండా చూసుకుంది.  

సిద్ధార్థ్‌ విఫలం...
వేలంలో భారీ మొత్తానికి ధర పలకడంతో పాటు ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్‌ ఆడిన టైటాన్స్‌ ఆటగాడు సిద్ధార్థ్‌ దేశాయ్‌ నిరాశపర్చాడు. తొలి అర్ధభాగంలో ఆరు సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను ఒక్క పాయింట్‌ కూడా సాధించలేకపోయాడు. మూడు సార్లు అతడిని ప్రత్యర్థి జట్టు పట్టేయగా, రెండు సార్లు ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. ఒకసారైతే ‘డు ఆర్‌ డై’ రైడ్‌లో కూడా ఖాళీగా రావడంతో టైటాన్స్‌ పాయింట్‌ కోల్పోవాల్సి వచ్చింది. అన్యమనస్కంగా కనిపించిన అతడిని కోచ్‌ రెండో అర్ధభాగంలో తొలి తొమ్మిది నిమిషాలు డగౌట్‌లోనే కూర్చోబెట్టాడంటే అతని ఆట ఎలా సాగిందో అర్థమవుతోంది.

ఎట్టకేలకు తన ఎనిమిదో ప్రయత్నంలో బోనస్‌ ద్వారా పాయింట్‌ సాధించిన అతను చివర్లో మాత్రం బాగా ఆడేందుకు ప్రయత్నించాడు. జట్టు సాధించిన ఆఖరి 10 పాయింట్లలో 5 దేశాయ్‌ రైడింగ్‌లో తెచ్చినవే ఉన్నాయి. టైటాన్స్‌ తరఫున గరిష్టంగా రజనీశ్‌ 8 పాయింట్లు సాధించగా, కెప్టెన్‌ అబోజర్‌ 2 టాకిల్‌ పాయింట్లకే పరిమితమయ్యాడు. ముంబా తరఫున అభిషేక్‌ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య టాకిల్‌ పాయింట్లు సమంగా (10) ఉండగా రైడింగ్‌ పాయింట్లలో ముంబా 1 ఎక్కువగా సాధించింది. అయితే రెండు సార్లు ఆలౌట్‌ కావడంతో పోగొట్టుకున్న 4 పాయింట్లే తుది ఫలితంలో తేడాగా మారాయి.  
మరో మ్యాచ్‌లో విజయంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ సీజన్‌–7లో శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బుల్స్‌ 34–32 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. బెంగళూరు తరఫున పవన్‌ సెహ్రావత్‌ 9 పాయింట్లు స్కోరు చేయగా, పట్నా తరఫున పర్‌దీప్‌ నర్వాల్‌ 10, ఇస్మాయిల్‌ 9 పాయింట్లు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement