
'పార్టీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు'
కరాచీ: తాను ఓ పార్టీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అక్మల్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, ఇంగ్లండ్ తో వచ్చే నెలలో జరిగే ట్వంటీ 20 టీమ్ నుంచి తొలగించడం జరిగింది. పాకిస్థాన్ జట్టులోని 16 మంది ట్వంటీ బృందంలో ముందు అక్మల్ కు చోటు కల్పించినా.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో అతనిపై ఆకస్మిక వేటు పడింది.
దీనిపై స్పందించిన ఉమర్.. తాను పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో జరిగిన ఓ పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని కాగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నాడు. టీమ్ మేనేజర్ నుంచి అధికారిక అనుమతి తీసుకున్న తర్వాతే పార్టీకి వెళ్లినట్లు పేర్కొన్నాడు. తాను ఎక్కడా కూడా క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించలేదని పీసీబీకి వివరణ ఇచ్చే యత్నం చేశాడు. ప్రస్తుతం ఉమర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. దీనిపై ఇప్పటికే పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ కూడా ఉమర్ ను హెచ్చరించాడు. ఉమర్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఒకవేళ ఉమర్ క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైతే మాత్రం అతని క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్ధకమే.