న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలను చూసి తన తమ్ముడు ఉమర్ అక్మల్ బుద్ధి తెచ్చుకోవాలని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. వారిని చూసైనా మైదానంలోనూ, బయట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలంటూ ఉమర్ అక్మల్‌కు సూచించాడు. ఉమర్‌పై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సందర్భంగా బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని రహస్యంగా ఉంచినందుకుగానూ పీసీబీ ఈ శిక్ష విధించింది.
నిషేధ కాలంలో ఏ స్థాయి క్రికెట్ ఆడకూడదంటూ హెచ్చరించింది. ఈ సందర్భంగా కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ ‘ఉమర్ ఇంకా యువకుడు. అతను తప్పు చేసి ఉంటే ఇతరులను చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో విరాట్, సచిన్, ధోని జీవితాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వివాదాలకు దూరంగా సచిన్ నీతిగా క్రికెట్ ఆడాడు. విరాట్, ధోని, బాబర్ ఆజమ్‌ల నుంచి ఉమర్ ఇంకా చాలా నేర్చుకోవాలి’ అని కమ్రాన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment