శ్రీలంక కెప్టెన్లు వీరే..
లిమిటెడ్ ఫార్మట్‌కు ఉపుల్ తరంగ, టెస్టులకు దినేష్ చండిమల్‌లను కెప్టెన్లుగా ఎంపికచేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.
కొలంబో: లిమిటెడ్ ఫార్మట్‌కు ఉపుల్ తరంగ, టెస్టులకు దినేష్ చండిమల్‌లను కెప్టెన్లుగా ఎంపికచేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. బలహీనమైన జింబాంబ్వేతో స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నవిషయం తెలిసిందే. దీంతో శ్రీలంక బోర్డు అత్యవసరంగా సమావేశమై బుధవారం నూతన కెప్టెన్లను ప్రకటించింది.
వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న చండీమల్‌ను టెస్టులకు , మాథ్యూస్ గైర్హాజరీతో కెప్టెన్సీ చేసిన ఉపుల్ తరంగను వన్డే, టీ20లకు కెప్టెన్లుగా నియమించింది. దీంతో పాటు జింబాంబ్వేతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు జట్టును ప్రకటిస్తూ బోర్డు అధికారిక ట్వీటర్‌లో పోస్టు చేసింది. ఇక ఈ టెస్టుకు చండీమల్ కెప్టెన్‌గా తరంగ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వీరి సారథ్యంలోనే శ్రీలంక స్వదేశంలో భారత్‌తో 3 టెస్టులు, 5 వన్డేలు, 1టీ20 ఆడనుంది. ఉపుల్ తరంగ శ్రీలంక తరుపున 207 వన్డేలు ఆడి 14 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో 6,212 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 27 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 1,568 పరుగులు చేశాడు. ఇక టెస్టు కెప్టెన్ దినేష్ చండీమల్ 36 టెస్టులు ఆడి 8 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలతో 2,540 పరుగులు చేశాడు.
జింబాబ్వే చేతిలో ఓడటాన్ని తన కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాభవంగా చెప్పుకొచ్చిన మాథ్యూస్ 34 టెస్టులు, 98 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారథ్యంలోనే గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఈ సీజన్‌లో అతను గాయంతో కీలకమైన సిరీస్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టి20లకు, స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లకు అతను గైర్హాజరయ్యాడు. జయవర్ధనే వారసుడిగా 2013లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా లంక తరఫున యువ కెప్టెన్‌గా మాథ్యూస్ ఘనతకెక్కాడు.