
'నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోను'
కొలంబో: టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక వైట్ వాష్ కావడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా శ్రీలంక వన్డే కెప్టెన్సీ పదవి నుంచి ఉపుల్ తరంగా తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన తరంగా.. తన కెప్టెన్సీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసలు సారథి బాధ్యతల నుంచి తప్పుకునే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
'నేను కెప్టెన్సీ వదులు కోవడానికి సరైన కారణం లేదు. టీమిండియాతో ఓటమికి నేనొక్కడినే బాధ్యుణ్ని కాను. మొత్తం జట్టంతా చెత్త ప్రదర్శన చేసింది కాబట్టే ఓడాం. ప్రధానంగా మా బ్యాట్స్మెన్ సరిగా రాణించలేకపోవడం వల్లే ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాం. ఇక్కడ నా బాధ్యత కొంత వరకూ ఉన్నా.. పూర్తిగా నన్ను బలిపశువును చేయడం తగదు'అని తరంగా తెలిపారు. ఒకవేళ తమ జట్టు ఎలా ముందుకెళ్లాలి అనేది ఏమైనా ఉంటే అది సెలక్షన్ కమిటీ చూసుకుంటుందన్నారు. తామంతా నిలకడలేమి సతమతమైన కారణంగా 5-0 తో సిరీస్ ను కోల్పోవడానికి ప్రధాన కారణంగా తరంగా పేర్కొన్నారు.