
ఉపుల్ తరంగా
ఢాకా: ఇటీలవ పేలవమైన ఫామ్‌తో సతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టు.. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. తొలి టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకున్న లంకేయులు.. రెండో టెస్టులో 215 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క‍్రమంలోనే రెండు ట్వంటీ 20ల సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఈరోజు(గురువారం) ఢాకాలో ఇరు జట్ల మధ్య తొలి టీ 20 జరుగనుంది. దానిలో భాగంగా లంక ఆటగాడు ఉపుల్ తరంగా మాట్లాడుతూ.. టెస్టు సిరీస్‌లో ప్రదర్శననే టీ 20 సిరీస్‌లో కూడా పునరావృతం చేస్తామంటున్నాడు.
' టెస్టు సిరీస్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే టీ 20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాం. ఈ సిరీస్ మాకు చాలా ముఖ్యం. దాదాపు ఏడాదిన్నర కాలంగా మా జట్టులో నిలకడ లోపించింది. మేము నిలకడను అందిపుచ్చుకోవాలంటే బంగ్లాతో టీ 20 సిరీస్ సాధించడం ఎంతో అవసరం. సిరీస్‌ను గెలుస్తామని ఆశిస్తున్నా' అని తరంగా పేర్కొన్నాడు. ఢాకాలో వికెట్ ఎలా ఉండబోతుందనేది కచ్చితంగా చెప్పలేమని తెలిపిన తరంగా..మంచి వికెటే ఎదురవుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.